హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి కే టాయించిన ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్‌ను తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు తెలంగాణలో కొనసాగించాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఏపీ క్యాడర్లో చేరాలని బిస్త్‌కు కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను ఆమోదిస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్) తీర్పు ఇవ్వడం పై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ పీ శ్యామ్ కోశీ, జస్టిస్ నందికొండ న ర్సింగరావు ధర్మాసనం శుక్రవారం విచార ణ చేపట్టింది. తప్పుడు సీనియారిటీ లిస్ట్ కారణంగా బిస్త్‌ను ఏపీకి కేటాయించారని ఆమె తరఫు న్యాయవాది వాదించారు.
బిస్త్‌ను తొలుత 1994లో పశ్చిమ బెంగాల్‌కు కేటాయించారని, ఆ తర్వాత ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిని వివాహం చేసుకోవడం తో ఆమెను 1997లో ఏపీ క్యాడర్‌కు మా ర్చుతూ కేంద్రం ఆదేశాలిచ్చిందని తెలిపా రు. బిస్త్ ఏపీలో చేరిన తేదీని సీనియారిటీలో పరిగణనలోకి తీసుకున్నారని, ఆమె వాదనలు వినకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ ప్రతివాదన చేస్తూ అఖిలభారత సర్వీస్ అధికారుల కేటాయింపులకు సంబంధించిన వివాదాలపై ఇదే హైకోర్టులో పిటిషన్లు విచారణలో ఉన్నాయని చెప్పారు. అనంతరం హైకోర్టు స్పందిస్తూ.. బిస్త్ పిటిషన్‌పై విచారణ ముగిసేవరకు ఆమెను తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్ర, రాష్ర్టాలకు మ ధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 నెలలకు వాయిదా వేసింది.