గజ్వేల్ అర్బన్, నవంబర్ 26: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఆదివారం పలువురు హైకోర్టు న్యాయవాదులు ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం వైష్ణవి గార్డెన్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు, బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు కొట్టాల యాదగిరి, ఫుడ్ కార్పొరేషన్ సభ్యుడు గోవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌లో సీఎంలకే గ్యారెంటీ లేదని, ఇక ఆరు గ్యారెంటీలకు దేవుడే దిక్కని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఎంతోమంది పంటలు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో 24 గంటల ఉచిత విద్యుత్తుతోపాటు పుష్కలంగా సాగునీరు అందుతున్నదని వివరించారు.
తద్వారా బంగారు పంటలు పండుతున్నాయని తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో పర్యటించామని, ప్రజలంతా కేసీఆర్‌నే కోరుకుంటున్నారని చెప్పారు. కరోనా సమయంలో కోర్టులు పనిచేయక.. కేసులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులను కేసీఆర్ ఆదుకున్నారని గుర్తు చేశారు. న్యాయవాదులకు ఒక్కొక్కరికి రూ.16 వేల ఆర్థిక సహాయం అందించి న్యాయవాదులకు మనోధైర్యం కల్పించారని, సంరక్షణ కోసం వెల్ఫేర్ ఫండ్ రూ.100 కోట్లు కేటాయించి ఇన్సూరెన్స్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జి పాతూరి సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఆత్మకమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బొగ్గుల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.