High Court | హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు మెడికల్, డెంటల్ కాలేజీల ప్రవేశాల్లో అవకాశం కల్పించాలని గురువారం తీర్పు చెప్పింది. మెడికల్ అడ్మిషన్ల నిబంధనలు- 2017కు సవరణగా 3(ఎ) నిబంధన చేర్చుతూ ప్రభుత్వం ఈ ఏడాది జూలై 9న జారీచేసిన జీవో 33ను రద్దు చేయాలంటూ దాఖలైన సుమారు 53 వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. సుదీర్ఘ వాదనల తర్వాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం 71 పేజీల తీర్పును వెలువరించింది.
మెడికల్ అడ్మిషన్ల నిబంధనలను సవరించి నిబంధన 3(ఎ)ను చేరుస్తూ జారీచేసిన జీవో 33ను రద్దు చేస్తే తెలంగాణవాసులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంటుందని, దేశవ్యాప్తంగా ఉన్నవారందరూ 85 శాతం స్థానిక కోటా కింద అడ్మిషన్లు పొందేందుకు వీలు ఏర్పడుతుందని ధర్మాసనం పేర్కొన్నది. కాబట్టి సవరణ నిబంధనను రద్దు చేయడం లేదని పేర్కొంది. ఈ నిబంధన కింద తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారు స్థానిక కోటా కింద మెడికల్ అడ్మిషన్లు పొందడానికి అర్హులేనని తేల్చింది. విద్యార్థి స్థానికత నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాలు లేనందున వాటిని రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించాక వాటిని పరిశీలించి ప్రతి విద్యార్థిని స్థానిక కోటా కింద అన్వయించి కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం సీట్లను కేటాయించాలని ఉత్తర్వులు జారీచేసింది. నిబంధన ప్రకారం నాలుగేండ్లు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలని, శాశ్వత నివాసం ఉండాలని పేరొన్నది. అర్హత పరీక్షలో తెలంగాణ నుంచి ఉత్తీర్ణత సాధించి ఉండాలని చెప్పింది.
తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారికి మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించడమే ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ నిబంధన 3(ఎ) లక్ష్యమని తెలిపింది. తెలంగాణకు చెందిన వ్యక్తి అర్హత పరీక్షలో ఇకడ ఉత్తీర్ణత సాధించలేదన్న కారణంగా అడ్మిషన్ నిరాకరిస్తే ఆ నిబంధన ఉద్దేశం నెరవేరనట్లేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ తీసుకువచ్చిన ఈ నిబంధన తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారికి వర్తించదని పేరొంది.
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసితులైన వారు 85 శాతం స్థానిక కోటా కింద అర్హులేనని హైకోర్టు పేర్కొంది. తెలంగాణ విద్యార్థి ఇతర రాష్ట్రం నుంచి అర్హత పరీక్ష రాశారని స్థానికత నిరాకరించడం సరికాదని హైకోర్టు తీర్పులో పేరొన్నది.
క్రీడల అభివృద్ధి పేరుతో ఐఎంజీ భారత్ అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఉమ్మడి ఏపీలో 2003లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు భూములు, పలు స్టేడియాలను ఇవ్వడం మీద దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. భూకేటాయింపుల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్, ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది శ్రీరంగారావు వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.ఈ కేసులో తీర్పు ను వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది.
తెలంగాణ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో అక్రమాలు జరిగాయని హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఆ సంస్థ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు శుక్రవారం విచారణ జరుపనుంది. ప్రభుత్వ ఖజానాకు రూ.1100 కోట్ల నష్టం కలిగించేలా అక్రమా లు జరిగాయని పిటిషనర్ ఆరోపించారు. బిడ్డర్లకు తకువ ధరకు వడ్లను విక్రయించి అత్యధిక ధరకు బియ్యం కొనుగోలు చేయడం ద్వారా పెద్ద మొత్తం లో అవినీతి జరిగిందని పేరొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతివ్వాలని దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. జేఎన్టీయూ, ఏఐసీటీఈలు అనుమతించిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు వీలుగా మధ్యంతర ఉత్తర్వుల జారీకి జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి నిరాకరించారు.
మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎంజీఆర్, విద్యాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి కాలేజీ, అనురాగ్ ఇంజినీరింగ్ కాలేజీ, సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ తదితర కాలేజీలు వేర్వేరుగా దాఖలు 11 వ్యాజ్యాల తరఫున సీనియర్ న్యాయవాదులు డీ ప్రకాశ్‌రెడ్డి, ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ, 2024 25 విద్యాసంవత్సరం ఆగస్టు 19 నుంచే మొదలైందని, మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే కౌన్సెలింగ్ ప్రక్రియపై ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ వాదనలను ఆమోదించిన న్యాయమూర్తి కాలేజీల పిటిషన్లను కొట్టివేశారు.