హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకం చట్టవిరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. శుక్రవారం తీర్పు వెలువరిస్తామని జస్టిస్ పుల్లా కార్తీక్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రకాశ్‌సింగ్ బాదల్ కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను అమలుచేయకుండానే బీ శివధర్‌రెడ్డిని డీజీపీగా నియమించారంటూ సామాజిక కార్యకర్త టీ ధన్‌గోపాల్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని కొట్టేయాలంటూ అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదించారు. హైకోర్టు గత విచారణలో జారీచేసిన ఆదేశాల మేరకు ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను యూపీఎస్సీకి ప్రభు త్వం పంపిందని తెలిపారు. డిసెంబర్ 31న తాజాగా జాబితా పంపామని, అయితే ఆలస్యమైందన్న కారణంతో దానిని యూపీఎస్సీ వెనకి పంపిందని పేర్కొన్నారు. యూపీఎస్సీ న్యాయవాది కులకర్ణి ప్రతివాదన చేస్తూ.. యూపీఎస్సీకి ఏడేండ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జాబితా పంపిందని తెలిపారు.
ఇది ప్రకాశ్‌సింగ్ బాదల్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం కాబట్టి, దీనిపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత పొందాల్సి ఉన్నందునే జాబితాను వెనకి పంపినట్టు వివరించారు. పిటిషనర్ న్యాయవాది కల్పించుకుని, ప్రభుత్వం ఆలస్యంగా జాబితా పంపడాన్ని తీవ్రంగా పరిగణించాలని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలుచేయనట్టుగా పరిగణించి డీజీపీ నియామకం చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరారు. వాద, ప్రతివాదనలు ముగియడంతో శుక్రవారం తీర్పును వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.