హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని భూ వివాదంపై ప్రైవేటు వ్యక్తులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ భూమిలో చేపట్టిన ‘హైరైజ్ ’ నిర్మాణాలపై తదుపరి విచారణలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సికిందర్ ఖాన్, సలాబత్ ఖాన్, పల్లవి, సోహిని బిల్డర్స్ డీఏజీపీఏ హోల్డర్ బండి బిందుతోపాటు బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీకి రెండు వారాల్లోగా ఈ నోటీసులు అందజేయాలని, అనంతరం వారికి నోటీసులు ఇచ్చినట్టు రుజువుచేసే ఆధారాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది.
ఖాజాగూడ సర్వే నంబర్ 27లోని 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు భారీ టవర్లను నిర్మిస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్‌రెడ్డి (జడ్చర్ల), యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), మురళీ నాయక్ భూక్యా (మహబూబాబాద్ ), కూచికుళ్ల రాజేశ్‌రెడ్డి (నాగర్‌కర్నూల్) దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ యారా రేణుక ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చికుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. 1955-58 కాస్రా పహాణీ సర్వే నంబర్ 117/3/1లోని 27.18 ఎకరాల భూమి సర్వే నంబర్‌ను మార్చి, ప్రభుత్వ పోరంబోకు భూమిగా మార్చేశారని తెలిపారు. ఆ తర్వాత రంగారెడ్డి కలెక్టర్ ఎన్వోసీ ఇవ్వడంతో ఆ భూమిలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతి మంజూరు చేసిందని వివరించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శులు, సీసీఎల్ఏ, రంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు, హైడ్రా, పీసీబీ, శేరిలింగంపల్లి తహసీల్దార్ రెరాకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. ఈ వాదనల అనంతరం ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను రెండువారాలపాటు వాయిదా వేసింది.