హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేస్తూ ఈ నెల 11న వెలువరించిన తీర్పును బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో సవాలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం చేపట్టింది. ప్రతివాదులైన దానం, స్పీకర్, ట్రిబ్యునల్ చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు జారీచేస్తూ తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది.
అంతకుముందు సీనియర్ న్యాయవాది కేవీ వెంకటరెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తొలుత స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, దీంతో ఈ వివాదం హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే విచారణ జరిపిన స్పీకర్ (ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో) అనర్హత పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు చెప్పారని వివరించారు. బీహార్‌కు చెందిన మహాచంద్రప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక పార్టీ తరఫున చట్టసభకు ఎన్నికైన వ్యక్తి మరో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీకి నామినేషన్ దాఖలు చేసినట్లయితే స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్టు భావించాలని తెలిపారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫారం తీసుకొని, లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీచేశారని చెప్పారు. ఆ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని తెలిపారు. ఈ విషయంలో స్పీకర్.. దానం నాగేందర్ అసెంబ్లీ బయట నిర్వహించే వ్యవహారాలను చూడటంలేదని, సభలో జరిగిన వ్యవహారాలనే పట్టించుకుంటానని పేరొనడం సరికాదని అన్నారు. స్పీకర్ తీర్పు చట్టవిరుద్ధంగా ఉన్నదని చెప్పారు. ఆ తీర్పు లోపభూయిష్టమని, చట్టవ్యతిరేకమని ప్రకటించాలని కోరారు.
దానం పార్టీ ఫిరాయింపునకు పాల్పడటం వల్ల దాని ప్రభావం ప్రభుత్వంపై ఏమీ ఉండదని, అస్థిరతకు గురిచేయదని స్పీకర్ తేల్చడం దారుణమని అన్నారు. దానం పార్టీ ఫిరాయింపు వల్ల శాసనసభలో అధికార, విపక్ష పార్టీల మెజారిటీపై కూడా ఎలాంటి ప్రభావం చూపదనడాన్ని తప్పుపట్టారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ తరఫున బహిరంగంగా చట్టసభ ఎన్నికల్లో పోటీ చేసినట్టు ఆధారం కంటికి కనిపిస్తున్నప్పుడు.. వేరొకరి సాక్ష్యం అవసరం లేకుండానే స్పీకర్ అతనిపై అనర్హత వేటు వేయకపోవడం శోచనీయమని అన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీ తరఫున పోటీ చేశారంటే అది పార్టీ ఫిరాయింపు కిందికే వస్తుందని చెప్పారు. ఇలాంటి వ్యవహారంపై ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్పీకర్ పట్టించుకోలేదని తెలిపారు. ఒక పార్టీకి చెందిన సభ్యుడు మరో పార్టీ తరఫున పోటీ చేసినట్టయితే తన మొదటి రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో వెలువరించిన తీర్పును స్పీకర్ విస్మరించారని చెప్పారు. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి కల్పించుకుంటూ.. హైకోర్టు జారీచేసిన నోటీసులను స్వీకరిస్తున్నట్టు చెప్పారు. అయితే, రెండో ప్రతివాది దానం నాగేందర్ కౌంటరు దాఖలు చేయాలని చెప్పడంపై పిటిషనర్ న్యాయవాది వెంకట్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పారు. గతంలో స్పీకర్, దానం తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేశారని గుర్తుచేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం, ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.