హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మలాజిగిరి జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయిచేసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు బీఎన్ఎస్లోని 191(2) సెక్షన్ ఎలా వర్తిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. ఆ సెక్షన్ కింద ఈటలపై కేసు ఎలా నమోదు చేశారో వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఏకశిలానగర్‌లో సామాన్యుల భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, గూండాలు, కుకలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ కాలనీ వాసులను బెదిరిస్తున్నారని అకడికి వెళ్లిన ఈటల తమపై దాడికి పాల్పడినట్టు వాచ్‌మన్ జీ ఉపేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోచారం పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఈటల దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం విచారణ జరిపారు.
ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసని ఈటల న్యాయవాది చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రాజకీయ అంశాలపై ఇకడ వాదించవద్దని, ఈ కేసుకు సంబంధించిన అంశాలకే పరిమితమై వాదనలు వినిపించాలని తేల్చిచెప్పింది. దీంతో తప్పుడు ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని ఈటల తరఫు న్యాయవాది కోరారు. దీనిపై ఉపేందర్‌కు నోటీసులు జారీచేసిన కోర్టు.. తదుపరి విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది.