హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ పెట్టిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఇద్దరు నిందితుల బెయిలు పిటిషన్లను త్వరగా పరిషరించాలని కింది కోర్టుకు హైకోర్టు సూచించింది. ఫోన్ ట్యాపింగ్‌పై చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో తమను అక్రమంగా అరెస్ట్ చేశారని, బెయిలు మంజూరు చేయాలంటూ టీ సంతోష్‌కుమార్, బీ పరశురాములు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు, రాధాకిషన్‌రావుకు హైకోర్టు ముం దస్తు బెయిల్ ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని నిందితుల తరఫు న్యాయవాది తెలిపారు. పోలీసులు సంతోష్, పరశురాములును విచారణకు అని పిలిచి అరెస్ట్ చేశారని, బెయిలుపై విడుదల చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిందితుల బెయిలు పిటిషన్లు కింది కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణ చేపట్టి నిర్ణయం వెలువరించాలని సూచించారు.