హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై హైకోర్టు ఆదేశాలు ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 9ని సవాలు చేస్తూ కొందరు, సమర్థిస్తూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 9ని సవాల్ చేస్తూ గతంలో రెండు పిటిషన్లు దాఖలవ్వగా సోమవారం రెండు పిటిషన్లు, మంగళవారం మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.బీసీ రిజర్వేషన్లను సమర్థిస్తూ పలు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. బీసీ రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగబద్ధమేనని పేరొంటూ బీసీ సంఘ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేర్వేరుగా ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. ఈ అన్ని పిటిషన్లపై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. ఓ వైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసి, ఎలక్షన్ ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నది. గురువారం నోటిఫికేషన్ కూడా ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్థానిక పోరు ముందుకు సాగుతుందా? నోటిఫికేషన్ వస్తుందా? లేక ఎన్నికలు కొన్ని రోజులు వాయిదా పడతాయా? అనే ఆసక్తి నెలకొంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై వంగా గోపాల్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని ఆ పిటిషన్‌ను ద్విసభ్య బెంచ్ డిస్మిస్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి హైకోర్టు నిర్ణయంపైనే నిలిచింది. ఆదేశాలు ఎలా వెలువడనున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందు వెళ్తుందన్నది ఆసక్తిగా మారింది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ప్రకటించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి వాటిని గవర్నర్ వద్దకు పంపించింది. ప్రత్యేకంగా ఆర్డినెన్స్‌లను కూడా తీసుకొచ్చింది. అవి రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సెప్టెంబర్ నెలాఖరులో జీవో నంబర్ 9 తీసుకొచ్చింది. రిజర్వేషన్లు ఖరారు చేసి గెజిట్లు ముద్రించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది. ఆ వెంటనే మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ ఇచ్చింది. ఆ జీవోను సవాల్‌చేస్తూ తొలుత మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణను హైకోర్టు.. ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ వ్యవధిలో మరో పది మంది హైకోర్టులో పిటిషన్ వేయగా, వారిందరినీ ఇందులో ఇంప్లీడ్ చేసింది. మరోవైపు రిజర్వేషన్ల ద్వారా బీసీల్లో కొన్ని వర్గాలే ఎక్కువగా లబ్ధిపొందుతున్నాయని, అందువల్ల రిజర్వేషన్లలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ కూడా చేపట్టాలనే పిటిషన్ కూడా దాఖలైంది. మరోవైపు రైతు సంఘాల సమాఖ్య తరఫున దాఖలైన పిటిషన్లో రైతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అన్ని కులాల వారికీ ఉపయుక్తమని పేరొంది. రైతులకు విద్య, ఉపాధి, రాజకీయ సాధికారితకు దోహపడుతుందని పేరొంది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా హాజరుకానున్నారని సమాచారం. జీవో 9ను సవాలు చేస్తూ బుట్టెంగారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు జే ప్రభాకర్, బీ మయూర్‌రెడ్డి, కేవీ రెడ్డి తదితరులు వాదనలు వినిపించనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్లు అన్ని కలిపి కూడా 50 శాతం దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీల 10 శాతం, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 42 శాతంతో కలుపుకుంటే మొత్తం 67 శాతం అవుతున్నదని ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని కొందరు పిటిషనర్లు వాదిస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 9ని తక్షణమే రద్దుచేయాలని కోరుతున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. కులగణన చేపట్టి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కేటాయించినందున తమ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నది. అయితే, జీవో ద్వారా బీసీ రిజర్వేషన్ కల్పన సాధ్యం కాదని, ఆ విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలుసని బీసీ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే రేవంత్ సర్కారు ఈ రిజర్వేషన్ నాటకాలు ఆడుతున్నదని ఆరోపిస్తున్నారు.
స్థానిక సంస్థల పాలకవర్గాల ఎన్నికలు ఇప్పటికే ఏడాది ఆలస్యమయ్యాయి. అనేక ప్రాంతాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు హైకోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా పండుగకు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినా పెద్దగా ఖర్చు పెట్టలేదు. తీర్పు ఏ విధంగా వస్తుందో, ఎన్నికలు జరుగుతాయో, వాయిదా పడతాయో, ఇప్పుడున్న రిజర్వేషన్లు మారుతాయో.. ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు చేస్తే ఎలా? అని ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించలేదు. వారంతా ఇప్పుడు హైకోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం హైకోర్టు బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునిస్తే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. ఒకవేళ ప్రతికూలంగా తీర్పు వెలువరిస్తే మాత్రం రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయి. రిజర్వేషన్లు 50 శాతం మించవద్దు అంటే బీసీలకు స్థానాలు తగ్గి జనరల్‌కు పెరగనున్నాయి. రాజకీయ సమీకరణాలు మారుతాయి. షెడ్యూల్, నోటిఫికేషన్ మరింత ఆలస్యమవుతుంది. ఎన్నికలు కూడా వాయిదా పడతాయి.