హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పూర్తి రాజకీయ నివేదికలా ఉన్నదని, దానిని రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు హైకోర్టును కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగా న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కమిషన్ చట్టవిరుద్ధంగా విచారణ జరిపిందని, తమను సాక్షులుగా పిలిచి, క్రాస్ ఎగ్జామినేషన్‌కు అవకాశమే ఇవ్వకుండా ఏకపక్షంగా నివేదికను సమర్పించిందన్నారు. పూర్తి నివేదికను ఇవ్వాలని తాము కోరినా స్పందించకుండా, మీడియాకు లీకులు ఇస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రస్తుత ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని, మీడియాలో తమపై దుష్ప్రచారం చేయకుండా కట్టడి చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిగింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ నిర్మాణంలో డిజైనింగ్, ప్రణాళికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను రద్దు చేయాలని పిటిషన్లలో కోరారు. కమిషన్ జరిపిన విచారణ తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
రాజకీయ కుట్రతోనే కమిషన్ నియామకం జరిగిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ కీర్తిని కించపర్చాలన్న దురుద్దేశంతోనే కమిషన్ ఏర్పాటైందని తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ ఏడాది జూలై 31న ఇచ్చిన నివేదికలో మాజీ సీఎం కేసీఆరే స్వయంగా ప్రాజెక్ట్ ప్రదేశాలను ఎంచుకున్నారని, క్యాబినెట్ ఆమోదం లేకుండా పరిపాలనా ఆమోదాలు ఇచ్చారని పేరొనడాన్ని కేసీఆర్ సవాల్ చేశారు.
కాంట్రాక్టర్లకు అనుకూలంగా, అదనపు పనులు మౌఖిక ఆదేశాల ద్వారా అప్పగించారని కమిషన్ ఎత్తిచూపడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో కంటి తుడుపు చర్యగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదించారే తప్ప మరేమీ లేదని తేల్చిచెప్పారు. వాస్తవానికి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందని, అంతర్ రాష్ట్ర సమస్యలు, నీటి లభ్యత లేకపోవడం తదితర కారణాలతో ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు.
2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ ద్వారా సర్వే చేయించి, ఆ నివేదిక ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌లతో కూడిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్ నిర్మాణం చేయాలనే నిర్ణయానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. రీ డిజైనింగ్, పేరు మార్పునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, సంబంధిత సంస్థల నుంచి అనుమతులు ఉన్నాయన్నారు. రికార్డు సమయంలోనే ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చామన్నారు. ఫలితంగా సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చుకోగలిగామన్నారు. ఒకప్పుడు కరువు, రైతుల ఆత్మహత్యలు, వలసలకు ఆలవాలమైన తెలంగాణ ప్రాంతం అతి తక్కువ సమయంలోనే ‘దేశానికే ధాన్యాగారం’గా ఎదిగిందని పేర్కొన్నారు.
భారీ వర్షాలు, ఇతర సాంకేతిక కారణాలతో మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ కుంగిపోయిందన్నారు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తలు, కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారంతో బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బరాజ్‌లో నిరంతరం పూర్తిస్థాయిలో నీరు నిల్వ చేయడం వల్ల నిర్మాణానికి నష్టం జరిగిందని, ప్రణాళిక నుంచి నిర్మాణం వరకు అనేక ఆర్థిక, విధానపరమైన లోపాలు జరిగాయని, ఇవి రాజకీయ నాయకత్వం నిర్ణయాల వల్ల జరిగాయని కమిషన్ నివేదికలో పేరొనడాన్ని తప్పుబట్టారు. ఇది తమ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలా ఉందని కేసీఆర్, హరీశ్‌రావు పేర్కొన్నారు. కమిషన్ నివేదిక ప్రతిని పిటిషనర్లుకు అందజేయకుండానే ప్రభుత్వం మీడియా ద్వారా దుష్పప్రచారం చేస్తున్నదని, దురుద్దేశపూరితంగా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని వెల్లడించారు. తక్షణమే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లో కోరారు. ఆధారాలు లేకుండా కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రతోనే కమిషన్ ఏర్పాటు జరిగిందన్నారు. ఈ కుట్రలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
3బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల టన్నెళ్లు, 1531 కిలోమీటర్ల కాలువలు, 38 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 530 మీటర్ల ఎత్తిపోతల వ్యవస్థతో 240 టీఎంసీల నీటి వినియోగం కోసమే ప్రాజెక్టు నిర్మాణం చేసినట్టు పిటిషన్లో వివరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నీటిపారుదల సామర్థ్యం, సాగు విస్తీర్ణం పెంచడంతోపాటు రాష్ట్ర తాగునీటి, పారిశ్రామిక అవసరాల కోసమేనని వెల్లడించారు. అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏదో ఒక సాకుతో ప్రాజెక్టుకు అడ్డంకులు కల్పించిందని, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుకు ప్రయత్నించిందని వివరించారు. డిజైనింగ్, ఇంజినీరింగ్ అన్నీ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని వివరించారు. మేడిగడ్డ బరాజ్ వద్ద ఒక పిల్లర్ కుంగిపోడంతో మొత్తం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపైనే అధికార కాంగ్రెస్ పెద్దలు దుష్ప్రచారం ప్రారంభించారని తెలిపారు. పలు కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్న నివేదికను ఆధారంగా చేసుకుని.. సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఈ నెల ఆగస్టు 4న నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో పక్షపాతంతో, ముందస్తు వ్యూహంతో తమ పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని కోర్టుకు నివేదించారు.
విచారణ కమిషన్లు కేవలం వాస్తవాలను గుర్తించి నిజనిర్ధారణ నివేదికలు మాత్రమే ఇవ్వాలని పిటిషన్లో వివరించారు. ఆ సిఫార్సులు పరిపాలన, చట్టపరమైన చర్యలకు దోహదపడాలేగానీ గత పాలకుల ప్రవర్తనను లక్ష్యంగా చేసుకోడానికి కాదని తెలిపారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ – 1952 ప్రకారం కమిషన్‌కు వాస్తవాలు కనుగొనే అధికారం మాత్రమే ఉందని, దోష నిర్ధారణ చేసే అధికారంగానీ, పలానా వ్యక్తి తప్పు చేశారని శిక్ష విధించే అధికారంగానీ లేదన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిందన్నారు. చట్టంలోని సెక్షన్ 8-బీ, 8-సీ ప్రకారం, ఒక వ్యక్తి ప్రవర్తనపై దర్యాప్తు చేపట్టినా లేదా ఆ వ్యక్తి ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ముందుగానే నోటీసు ఇవ్వాలనే ప్రాథమిక న్యాయ సూత్రాన్ని కమిషన్ తుంగలోకి తొకిందన్నారు. ఆ వ్యక్తి సాక్ష్యాలు సమర్పించే అవకాశం ఇవ్వాలని, ఇతర సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే హకు కల్పించాలని, ఇవేమీ లేకుండా కమిషన్ ఏకపక్షంగా, చట్ట వ్యతిరేకంగా నివేదికలో తమపై పలు అభియోగాలు మోపిందన్నారు.
కమిషన్ నివేదిక గురించి మీడియాకు పదే పదే చెప్పడం, పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇవ్వడం వంటివి చేయడం కేవలం గత పాలకుల ప్రతిష్టను ప్రజల్లో చులకన చేయడమేనని వివరించారు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే కమిషన్ నివేదికను రద్దు చేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
కమిషన్‌కు శిక్ష విధించే అధికారం/బాధ్యత లేదని రామకష్ణ దాల్మియా కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు చెప్పిందని ఈ సందర్భంగా ఉదహరించారు. కిరణ్ బేడీ కేసులో ఎంక్వయిరీస్ ఆఫ్ కమిషన్ యాక్ట్ లోని 8-బీ అనే సెక్షన్‌ను విధిగా అమలు చేయాలని కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ ఎల్ కే అద్వానీ కేసులో కూడా సుప్రీంకోర్టు, కమిషన్ విచారణ చేపట్టాక ఏ వ్యక్తి ప్రతిష్ట అయినా దెబ్బతినే అవకాశముంటే విచారణ దశలోనే ఆ వ్యక్తి వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలనే హకు కాలరాయకూడదని చెప్పిందని తెలిపారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం గత ఏడాది మార్చి 14న జారీ చేసిన జీవో 6ను, కమిషన్ జూలై 31వ తేదీన సమర్పించిన నివేదికను రద్దు చేయాలని కోరారు.
నివేదికను ఆధారంగా చేసుకుని జరుగుతున్న ప్రచారాన్ని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. తమపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు, మీడియా ద్వారా జరగుతున్న ప్రచారం న్యాయప్రక్రియకు విరుద్ధమని, తుది తీర్పు వెలువడే వరకు కమిషన్ నివేదిక అమలును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.
శాసనసభకు 2023లో జరిగిన ఎన్నికలప్పుడు కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై దుష్ప్రచారం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. 2023లో భారీ వరదలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల మేడిగడ్డ బరాజ్‌లో ఒక పిల్లర్ కుంగిపోయిందని, అదేమీ నిర్మాణ లోపం కాదని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం కేసీఆర్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నారని, ప్రాజెక్టు ఖర్చులు పెరిగాయని, అధికారిక ప్రక్రియను అమలు చేయలేదనే కమిషన్ చేసిన ఆరోపణలు, అభియోగాలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని వివరించారు. విచారణ కమిషన్ తన వాదన వినకుండా, తనపై నేరపూరిత వ్యాఖ్యలు చేయడం చట్టవిరుద్ధమని పిటిషన్లో వెల్లడించారు. తనను కేవలం సాక్షిగా పిలిచి, అభియోగాలు మోపడం ద్వారా కమిషన్ మోసగించిందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇవన్నీ జరిగాయని వివరించారు.
కాళేశ్వరం కమిషన్ రిపోర్టును సవాల్ చేసేందుకు పిటిషన్లో పేర్కొన్న ప్రధాన కారణాలు..
1) కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్‌ల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో జరిగిన నిర్లక్ష్యం, అవకతవకలు, లోపాలపై విచారించి, బాధ్యులను గుర్తించేందుకు ‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం- 1952’ మేరకు 2024 మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ సుప్రీంకోర్టు గత తీర్పులను ఉల్లంఘించి విచారణ జరిపి, నివేదికను సమర్పించింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం, ఏకపక్షం, రాజ్యాంగ వ్యతిరేకం.
2) నేను ప్రస్తుతం తెలంగాణ శాసనసభ సభ్యుడిని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని. పలుమార్లు వరుసగా శాసనసభ, పార్లమెంటుకు ఎన్నికయ్యాను. 2014 నుంచి 2023 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాను. నా సారథ్యంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే రాజకీయ వ్యూహంలో భాగంగానే విచారణ కమిషన్ ఏర్పాటయింది. ప్రజానిధుల దుర్వినియోగం అనే ఆరోపణలపై ‘న్యాయ విచారణ’ చేపడుతున్నామని చెప్పి, ప్రభుత్వం అక్రమ పద్ధతుల్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కాబట్టి కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన జీవోను ఖండిస్తున్నాను.
3) మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు ‘కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్’లో భాగం. వాటిని తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల, కమాండ్ ఏరియా సామర్థ్యం, తాగు నీటిని అందించే సామర్థ్యం పెంచేందుకే మా ప్రభుత్వం నిర్మించింది. నిబంధనలకు, విధానాలకు లోబడి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించి, అమలు చేసింది.
4) తెలంగాణ దకన్ పీఠభూమిలోని ఎత్తయిన ప్రాంతం. సముద్ర మట్టానికి సగటున 500- 600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పాక్షిక శుష వాతావరణం, వర్షపాతం తకువగా నమోదయ్యే భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో దిగువ భాగంలో ప్రవహిస్తున్నాయి. దీంతో ఎత్తయిన ప్రాంతంలోని తెలంగాణ భూములకు భూమ్యాకర్షణ శక్తిని ఉపయోగించి నదీ జలాలను తరలించడం, కాల్వల ద్వారా సాగునీరు అందించడం అసాధ్యం. ఈ భౌగోళిక పరిస్థితుల వల్లే తెలంగాణను దేశంలోనే అత్యంత కరువు పీడిత దుస్థితి ప్రాంతాల్లో ఒకటిగా మార్చాయి. అంతేకాదు వివిధ రాజకీయ శక్తుల కారణంగా హైదరాబాద్ ప్రావిన్స్ 1956 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలవంతంగా విలీనం చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది. ఆంధ్ర పాలకుల నుండి రాజకీయ సంకల్పం, నిబద్ధత లేకపోవడం వల్ల తెలంగాణకు ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు అందలేదు.
నీటిపారుదల ప్రాజెక్టులు లేకపోవడం, వర్షపాతం తకువగా ఉండటం వల్ల నీటి కొరత తీవ్రంగా ఉండేది. అందుబాటులో ఉన్న భూగర్భ జలాల్లోనూ అత్యధిక మోతాదులో ఫ్లోరైడ్‌తో ఉంది. దాని ఫలితంగా తరతరాలుగా ప్రజలు వైకల్యాలతో బాధపడుతున్నారు. ఫలితంగా తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
5) తెలంగాణలో రైతు బాధలు, అభివృద్ధిలో అసమానతల కారణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్యమం మొదలైంది. దీంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పాటుపడుతున్నట్టు ప్రజలను ఏమార్చడంతోపాటు రాజకీయ ప్రచారం, కంటితుడుపు చర్యల్లో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేదర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు 2007లో ప్రకటించింది. తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించి 160 టీఎంసీల గోదావరి నదీ జలాలను ఎత్తిపోసి 7 తెలంగాణ జిల్లాలకు సాగు నీరు అందిస్తామని నమ్మబలికింది. అయితే ఆ ప్రాజెక్టు డిజైన్‌పై మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పైగా మిగులు జలాలు అందుబాటులో లేని ప్రాంతంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూపొందించారు. వీటికితోడు అనేక అంతర్ రాష్ట్ర సమస్యలు, జలసంబంధ, పర్యావరణ కారణాలు, వల్ల తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణం అసాధ్యమని తేలిపోయింది.
6) ప్రాణహిత-చేవెళ్ల అనేది అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు. తమ్మిడిహట్టి దగ్గర పూర్తి రిజర్వాయర్ లెవల్ (ఎఫ్ఆర్ఎల్) 152.00 మీటర్ల ఎత్తుతో, 5.09 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్ నిర్మించాలి. అయితే ఆ ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్‌ను నిర్మిస్తే తమ రాష్ట్రంలోని భూములు మునుగుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నది. పునరావాస సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ముంపును తగ్గించేందుకు బరాజ్ ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించాలని మహారాష్ట్ర కోరింది. ఈ అంతర్ రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలనే నిబద్ధత గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేకపోవడంతో ప్రాజెక్టు అమలుకు నోచుకోలేదు. కాగితాలకు, రాజకీయ ప్రచారానికి పరిమితం అయ్యింది.
7) తర్వాత ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రం వేరయ్యింది. కొత్త రాష్ట్రం, ఉరకలేసే ఉత్సాహం, ప్రేరణతో బీఆర్ఎస్ పాలన మొదలైంది. రైతుల బాధలు, తాగునీటి కొరత, రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి నీటి అవసరాలను తీర్చడానికి, నీటిపారుదల రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందులో భాగంగా 2015 ఫిబ్రవరి 17న తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. రెండు ప్రభుత్వాల మధ్య ఏర్పాటైన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని పట్టుబట్టింది. 152 మీటర్ల స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోబోమని తేల్చిచెప్పింది. మరోవైపు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) 18.02.2015, 04.03.2015 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఇందులో తమ్మిడిహట్టి బరాజ్ నిర్మించాలనుకున్న ప్రాంతంలో ఏడాది పొడవునా 160 టీఎంసీల మేరకు మిగులు జలాలు ఉండవని స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్రయోజనం నెరవేరాలంటే ప్రత్యామ్నాయ స్థలాన్ని అన్వేషించాలని సూచించింది.
8) ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ప్రదేశాలతోపాటు మొత్తంగా ప్రాజెక్టు నిర్మాణంపైనే అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ నివేదిక ప్రకారం అంతర్ రాష్ట్ర సమస్యలు తగ్గాలన్నా, నీటి లభ్యత పెరగాలన్నా ప్రాజెక్టును రీ డిజైన్ చేయడం, నిర్మాణ ప్రాంతాన్ని మార్చడం తప్ప మరో మార్గం లేదని అర్థమైంది. ప్రాజెక్టును రీ డిజైన్ చేయాలనే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఈ నేపథ్యంలో బరాజ్ నిర్మాణానికి తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించి సిఫార్సు చేసేందుకు మెస్సర్స్ వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ (వాపోస్), కేంద్ర ప్రభుత్వ సేవలు కావాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ కోరింది. ఈ విజ్ఞప్తిని సైతం మంత్రివర్గం ఆమోదించింది. దీంతో వాప్కోస్ సంస్థ లైడార్ వైమానిక సర్వే నిర్వహించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద ప్రత్యామ్నాయ ప్రదేశాలను ప్రతిపాదించింది.
9) వాపోస్ నివేదిక, తమ్మిడి హట్టి దగ్గరున్న పరిస్థితులను పరగణనలోకి తీసుకుని ప్రాజెక్టును మరోచోట నిర్మించాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదించింది. ప్రాజెక్టు పేరును ‘కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్ ’గా మార్పు చేసింది. పనులు వేగంగా జరగడం, అవసరమైన నిధులను సమకూర్చుకునే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్’ అనే ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికిల్) ఏర్పాటుచేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద ఒక బరాజ్, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మధ్య అన్నారం, సుందిళ్ల వద్ద మరో రెండు బరాజ్‌లను నిర్మించాం. ఆ బరాజ్‌ల మధ్య నిలిచిన నీటిని కాలువలు, సొరంగాలు, ఎత్తిపోతల, జలాశయాలు, డిస్ట్రిబ్యూటర్ నెట్ వర్ ద్వారా తెలంగాణలోని 13 జిల్లాల్లో విస్తరించి ఉన్న కమాండ్ ఏరియాకు తరలించాలని, తద్వారా 18,25,700 ఎకరాల వ్యవసాయ భూమికి సాగు నీరు అందజేయాలని సంకల్పించాం. దీంతోపాటు హైద్రాబాద్-సికింద్రాబాద్ నగరాలకు అనేక ఇతర పట్టణాలు, మున్సిపాలిటీలకు తాగునీటి కష్టాలను తీర్చేందుకు 40 టీఎంసీలు, రాష్ట్ర పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలను కేటాయించాం. గతంలో ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో నీటిసామర్థ్యం 11.43 టీఎంసీలు మాత్రమే కాగా, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంతో నీటి సామర్ధ్యం 147.71 టీఎంసీలకు పెరిగింది. మొత్తంగా.. తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మిస్తే మహారాష్ట్రతో అంతర్ రాష్ట్ర సమస్యలతోపాటు ఆశించిన స్థాయిలో నీటి లభ్యత ఉండదనే కారణాల వల్లే కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంప్రాజెక్టును రీ డిజైన్ చేయాల్సి వచ్చింది.
10) కాళేశ్వరం ప్రాజెక్టును అమలు చేయడానికి కేంద్ర జల సంఘం, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, సాంకేతిక సలహా కమిటీ మొదలైన వాటితో సహా కేంద్ర ప్రభుత్వం/తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/ ఏజెన్సీల నుంచి అవసరమైన అన్ని అనుమతులను సాధించాం.
11) పై వివరాలను పరిశీలిస్తే అప్పటి తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి చట్టాలను, నియమాలను ఉల్లంఘించలేదని స్పష్టమవుతుంది. బరాజ్ స్థలాలతోసహా అన్ని ప్రాజెక్ట్ స్థలాలను పూర్తిగా పరిశీలించి, మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి, ఇతర ప్రమాణాలను పాటించాం. కాబట్టే సంబంధిత ఏజెన్సీలు ప్రాజెక్టు అమలుకు అనుమతులు ఇచ్చాయి.
12) రాజ్యాంగంలోని ఆర్టికల్166 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ముఖ్యమంత్రిగా నా నేతృత్వంలోని మంత్రివర్గం సలహాలు, సూచనల మేరకు సంబంధిత అన్ని విభాగాలతోసహా అప్పటి తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు రీడిజైన్ నిర్ణయం తీసుకున్నది. బిజినెన్స్ రూల్స్ ప్రకారం నిర్ణయాలన్నీ రాష్ట్ర గవర్నర్ పేరిట తీసుకున్నాం. మంత్రి మండలి సలహాలు, సూచనల ప్రకారం గవర్నర్ కార్యనిర్వాహక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దానికి మంత్రులందరి సమష్టి బాధ్యత ఉంటుంది. ఏకవ్యక్తి బాధ్యత ఉండదు, ఉండకూడదన్నది ప్రాథమిక సూత్రం.
13) సంబంధిత విభాగాలు/ ఏజెన్సీల నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాతే అప్పటి తెలంగాణ ప్రభుత్వం కాశేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాతే సాంకేతిక నిపుణులు, కన్సల్టెంట్లు, ఇంజినీర్లు కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌ల రూపకల్పన, వివిధ ప్యాకేజీల్లోని పనులకు ప్రణాళిక (డ్రాయింగ్) రచించారు.
14) డ్రాయింగ్లను అప్పటి ప్రభుత్వం ఆమోదించిన తర్వాత, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌ల నిర్మాణంతో సహా అన్ని పనుల కోసం గ్లోబల్ టెండర్స్‌ను ఆహ్వానించింది. బిడ్డింగ్‌లో పాల్గొని, ఎల్- 1గా నిలిచిన సంస్థలు, ఏజెన్సీలకే వర్ ఆర్డర్లు, కాంట్రాక్టులు ఇచ్చారు. 2017- 2018 సంవత్సరంలో పనులు మొదలయ్యాయి. ప్రభుత్వ చొరవతో రికార్డు సమయంలోనే వివిధ ఏజెన్సీలు పనులు పూర్తి చేశాయి. అయితే ప్రాజెక్టు ఆపరేషన్, నిర్వహణ ఆయా ఏజెన్సీల పరిధిలోనే ఉంటుంది. నిర్దేశిత గడువు వరకు ప్రాజెక్టు మరమ్మతులు, నిర్వహణ వంటివి ఆయా ఏజెన్సీలే చేయాల్సి ఉంటుంది.
15) మేడిగడ్డ బరాజ్ నుంచి నీటిని విజయవంతంగా వివిధ జలాశయాలకు మళ్లించి, రికార్డు సమయంలోనే రైతులకు సాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చాం. తద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు విజయవంతమైంది. కరువు, రైతు ఆత్మహత్యలు, బలవంతపు వలసలు, ఫ్లోరోసిస్ వంటి సమస్యలకు చిరునామాగా నిలిచిన తెలంగాణ ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టు వల్ల అతి తకువ సమయంలోనే అత్యధిక వరి సాగుతో ‘దేశానికే అన్నం గిన్నె’, ‘దేశ ధాన్యాగారం’ అనే స్థాయికి తీసుకొచ్చాం.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయడం వల్లే ఈ మార్పు సాధ్యం అయ్యి ంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు అంతర్భాగంగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు ‘తెలంగాణ జీవనాడి’ అని నిస్పందేహంగా చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధిక నీటి అవసరాలను ఈ ప్రాజెక్టే తీర్చుతున్నది.
16) 2023 వర్షాకాలంలో అధిక వర్షపాతం, ఇతర వివిధ సాంకేతిక కారణాల వల్ల మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్‌లో ఉన్న 20వ నంబర్ పిల్లర్ కుంగిపోయింది. ఇది దురదృష్టకర సంఘటన. బరాజ్ రూపకల్పన, ఇంజనీరింగ్‌తో, ఎవరి నియంత్రణ లేకుండా, ఎలాంటి సంబంధం లేని ఇతర సాంకేతిక కారణాల వల్లే ఇది జరిగింది. ఈ సంఘటనను నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశంగా మలుచుకున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై తప్పుడు ప్రచారం చేసింది. మొత్తం ప్రాజెక్టే కుంగిపోయినట్టుగా కాలుకు బలపం కట్టుకుని దుష్ప్రచారం చేసింది. పలు మీడియాల్లో సైతం ఇదే రకమైన కథనాలు ప్రచురితం/ప్రసారం అయ్యాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చాలా స్వల్ప తేడాతో అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లి అప్రతిష్టపాలు చేయడంతోపాటు ఆనాటి ప్రభుత్వం అమలు చేసిన కీలకమైన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుత (కాంగ్రెస్) ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్‌ను నియమించింది.
17) కాళేశ్వరం ప్రాజెక్టుకు మంత్రి మండలి ఆమోదం లేదని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌ల నిర్మాణానికి నాడు సీఎం హోదాలో ఉన్న నేను (కేసీఆర్) ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నానన్న కమిషన్ అభియోగాలు అవాస్తవం. నన్ను అప్రతిష్టపాలు చేసే కుట్ర ఇది. బరాజ్‌లపై కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ఏజెన్సీలు ఒక అభ్యంతరాన్ని కూడా లేవనెత్తలేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
18) కమిషన్ విచారించాల్సిన అంశాలు ఇలా ఉన్నాయి.
19) కమిషన్ నుంచి నాకు 20.05.2025 తేదీన సమన్లు అందాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్‌ల ప్రణాళిక, కాంట్రాక్టుల అప్పగింత, రూపకల్పన, నిర్మాణం, ప్రారంభోత్సవం సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నందున నా వాదనలు వినడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అందులో తెలిపింది. సాక్ష్యాలుగా ఏవైనా పత్రాలు/రికార్డులు ఉంటే సమర్పించవచ్చని సూచించింది. 5.06.2025న విచారణకు హాజరు కావాలని కమిషన్ కోరింది. వివరణ నిమిత్తం హాజరుకావాలన్న ఆ నోటీసు తప్ప మరే విధమైన ఇతర సమన్లు నాకు అందలేదు. విచారణను 05.06.2025 నుంచి 11.05.2025 లేదా మరేదైనా తేదీకి వాయిదా వేయాలని కమిషన్‌ను కోరాను. ఆ మేరకు కమిషన్ రీషెడ్యూల్ చేసింది.
20) ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తిగా నా చిత్తశుద్ధిని, సమగ్రతను, నిజాయతీని నిరూపించుకునే క్రమంలో కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యాను. కమిషన్ విచారణ ప్రశ్నలు-జవాబుల మాదిరిగా సాగింది. 20.05.2025 నాడు కమిషన్ జారీ చేసిన సమన్లలోగానీ, ప్రశ్నలు అడిగిన సమయంలోగానీ నేను చెప్పే విషయాలు న్యాయ పరిధిలోకి వస్తాయని గానీ, ఈ విచారణ నా ప్రతిష్టను దెబ్బతీస్తుందనిగానీ ఏ దశలోనూ పేరొనలేదు.
21) జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 31.07.2025 తేదీన తన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు మీడియాలో వచ్చిన వార్తలను గమనించిన తర్వాతే నాకు తెలిసింది. ఈ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, నీటిపారుదల శాఖ కార్యదర్శికి అందజేశారని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారని వార్తలు వచ్చాయి. అంతేతప్ప కమిషన్ నివేదికను నాకుగానీ, ఇతరులకుగానీ ఇవ్వలేదు. మీడియాకు అయినా పూర్తి నివేదికను అందజేయలేదు. కానీ అధికారులు ఆ నివేదిక ఆధారంగా ఒక ప్రెస్‌నోట్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేశారు. 04.08.2025 తేదీన ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బరాజ్‌లపై జ్యుడీషియల్ కమిషన్ అందించిన నివేదికపై ప్రజెంటేషన్’ అనే శీర్షికతో పత్రికా ప్రకటన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విడుదలైంది. ముఖ్యమంత్రి, నీటిపారుదలశాఖ మంత్రి ఇతర మంత్రులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కమిషన్ నివేదికను ప్రస్తావిస్తూ, నాకు అపకీర్తి, పక్షపాతం ఆపాదిస్తూ పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి నివేదిక కాపీ ఇవ్వాలని నేను 08.08.2025న సీఎస్‌కు లేఖ రాయగా, ఇప్పటివరకు ఇవ్వలేదు.
22) ముఖ్యమంత్రి, మంత్రుల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, ప్రెస్మీట్లో చెప్పిన విషయాల ఆధారంగా మీడియాలో నాపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించాలి. పక్షపాతంతో దారుణంగా, దుర్మార్గంగా, ద్వేషపూరితంగా జరిగిన ఈ దాడి.. నా ప్రతిష్టనుదెబ్బతీసేలా ఉన్నది.
23) ప్రభుత్వం విడుదల చేసిన పీపీటీని గమనిస్తే.. విచారణ కమిషన్, కమిషన్ చైర్మన్ విచారణ నిర్వహించిన తీరు ఏకపక్షంగా, దురుద్దేశపూర్వకంగా ఉన్నది. అలా చేయడం నిబంధనలకు వ్యతిరేకం. ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. ‘న్యాయ’ కమిషన్ సహేతుకతను దెబ్బతీసింది. పీపీటీ ప్రకారం కమిషన్ 13.04.2024న బాధ్యతలు స్వీకరించింది. 27.04.2024న అఫిడవిట్ రూపంలో ఆధారాలతో ఫిర్యాదులను ఆహ్వానిస్తూ పబ్లిక్ నోటీసు జారీ చేసింది. మొత్తం110 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. కమిషన్119మంది సాక్షులను విచారించింది. వారిలో నాతోపాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఇతరులు ఉన్నారు.
24) పీపీటీలో కమిషన్ నాపై అనేక విమర్శలు చేసింది. ఇందులో కొన్ని నా పరువును దిగజార్చేలా ఉన్నాయి. ఇందులో కొన్ని..
25. పైన పేరొన్న వ్యాఖ్యల ఆధారంగా కమిషన్ 31.07.2025న సమర్పించిన నివేదికలో బాధ్యులను నిర్ధారించింది. నాటి సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను బాధ్యులుగా తేల్చింది. మొత్తంగా ప్రాజెక్టులో విధానపరమైన, ఆర్థికపరమైన అవకతవకలు బాహాటంగా కనబడ్డాయని, తెలంగాణ రాష్ట్రానికి జీవనాడిగా నిర్ధేశించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను వ్యక్తిగత, రాజకీయ నాయకత్వం అవసరాలతో నడిపారని కమిషన్ పేర్కొన్నది. ప్రణాళిక, సాంకేతిక పర్యవేక్షణ, ఆర్థిక క్రమశిక్షణల తీవ్ర వైఫల్యం కారణంగా ప్రజాధనానికి భారీగా నష్టం జరిగినట్టుగా నివేదిక చెప్తున్నది. 3 బరాజ్‌ల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరగడంతో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపిస్తూ, ముగ్గురు ప్రజాప్రతినిధులను బాధ్యులను చేసింది.
26) కమిషన్ పైన చేసిన వ్యాఖ్యలను, ఆరోపణలను పరిశీలిస్తే నాపై ఉద్దేశపూర్వకంగా అభియోగాలు మోపినట్టు స్పష్టం అవుతున్నది. నేను రాష్ట్ర ప్రయోజనాలకు పాటుపడటం లేదని, వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నానని నివేదికలో పొందుపరిచారు. ఇది చట్టవిరుద్ధమే కాకుండా, న్యాయపరంగా చిక్కులు తెచ్చేదిగా ఉన్నది. నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా పక్షపాత ధోరణితో ఉన్నది.
27) కమిషన్, దాని చైర్మన్ స్వంతంత్రంగా వ్యవహరించలేదు. ప్రస్తుత రాష్ట్ర పాలకవర్గం చేసిన దుష్ప్రప్రచారాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఉన్నది. కమిషన్ నివేదిక పక్షపాతం, దురుద్దేశాలతో నిండింది. నివేదిక ముందస్తుగా రూపొందించారన్నట్టుగా ఉన్నది. నాటి సీఎంగా నేను, మంత్రిగా హరీశ్‌రావు సమర్పించిన ఆధారాలను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదు. మేము ఇచ్చిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకునే ఉద్దేశం లేకుండానే, ఊహాత్మకంగా మాత్రమే సమన్లు ఇచ్చినట్టు అనిపిస్తున్నది.
28) కమిషన్ /చైర్మన్ రాజకీయ నాయకులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా విచారణ నిర్వహించారు. నివేదిక నిజాయతీగా లేదు. దురుద్దేశం, పక్షపాతంతో కూడిన నివేదికను ఆదిలోనే హైకోర్టు కొట్టేయాలి.
29) నీటిపారుదలశాఖ 14.3.2024 తేదీన జారీ చేసిన జీవో 6ను తక్షణమే కొట్టేయాలి. ఎందుకంటే, నోటిఫికేషన్‌ను పరిశీలిస్తే.. అవకతవకలు, అక్రమ పద్ధతుల ద్వారా ప్రజాధనం దుర్వినియోగ ఆరోపణలపై న్యాయ విచారణకు కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ఉన్నది. ఈ లెక్కన విచారణలో గుర్తించిన లోపాల్లో ఆర్థిక అవకతవకలకు ఎవరు బాధ్యులో కమిషన్ నిర్ణయించింది.
30) విచారణ కమిషన్‌కు ’న్యాయ’ అధికారాలను మంజూరు చేయడం అభ్యంతరకరం. లోపాలకు బాధ్యులను నిర్ధారించే అధికారాన్ని కమిషన్‌కు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదలశాఖ కార్యదర్శి తమ అధికార పరిధిని అతిక్రమించారు. చట్టవిరుద్ధంగా లభించిన ఈ అధికారాలతో కమిషన్ నాతో సహా అనేక మంది వ్యక్తులను బాధ్యులుగా నిర్ధారించింది. పైగా సంస్థలకు చెల్లించిన నిధులను రికవరీ చేయాలని కూడా కోరింది.
31) విచారణ కమిషన్ల చట్టం- 1952 ప్రకారం కమిషన్లు ఎంపిక చేసిన అంశంపై విచారణలో నిజనిర్ధారణ మాత్రమే చేయాలి. ఎవరినీ బాధ్యులుగా నిర్ధారించరాదు. ఈ చట్టం కింద ఏర్పాటయ్యే కమిషన్ విచారణ పరిధి ఏమిటో సుప్రీంకోర్టు పలుమార్లు చాలా స్పష్టంగా తేల్చింది. ఫలానా వ్యక్తి అలా చేశారు?
ఇలా చేశారంటూ బాధ్యులుగా నిర్ణయించడం ద్వారా వ్యక్తి/వ్యక్తుల హకులకు భంగం కలిగించకూడదు. కమిషన్ చట్టంలోనూ ఇదే విషయం స్పష్టంగా ఉన్నది.
32) రామ్ కృష్ణ దాల్మియా వర్సెస్ జస్టిస్ ఎస్ఆర్ టెండులర్ మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని మార్గదర్శకాలకు కమిషన్ నివేదిక తిలోదకాలు ఇచ్చింది. కమిషన్ వాస్తవాలను కనుగొనవచ్చు గానీ శాసన లేదా కార్యనిర్వాహక చర్యల దిశగా కమిషన్ అడుగులు ఉండకూదని సుప్రీం కోర్టు తేల్చింది. ‘కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవాలో లేదో ప్రభుత్వ పరిధిలోని అంశం. సాక్షి నుంచి సేకరించి.. వివరాలను నివేదికలో పొందుపర్చాలేగానీ, దాని ఫలితాలను నమోదు చేయకూడదు. అది విచారణకు అనుబంధంగా పరిగణించడం అవుతుంది. ఇలా చేయడానికి వీల్లేదు. విచారణలో తేలిన అంశాలపై కమిషన్ సొంత అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదు. విచారణ కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేవు. కమిషన్ ఎదుట ఎవరైనా హాజరై ప్రకటన చేస్తే, చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం, భవిష్యత్తులో ఏమైనా సివిల్ /క్రిమినల్ కేసుల్లో సాక్షులుగా పరిగణించకూడదు. విచారణ కమిషన్‌కు పరిహారం లేదా శిక్షలను విధించే అధికారం ఉండదు’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
33) పీవీ జగన్నాథరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిశా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో, విచారణ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన ఉద్దేశాన్ని స్పష్టంచేసింది. చట్టంలోని సెక్షన్ 3 కింద నియమించబడిన కమిషన్ చేయాల్సిన విచారణ లక్ష్యాలను వివరించింది.
34) కమిషన్ జ్యుడీషియల్ బాడీ కాదు. కానీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో కమిషన్‌ను జ్యుడీషియల్ బాడీగా పేర్కొన్నది. ఇది విచారణ కమీషన్ల చట్టం ప్రకారం చెల్లదు. పైగా విచారణ జరిపి బాధ్యులను నిర్ధారించాలని జీవోలో పేర్కొన్నారు. కానీ కమిషన్‌కు అలాంటి అధికారం లేదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. బాధ్యులను గుర్తించడం, శిక్షలు వేయడం కమిషన్ పని కాదని, కోర్టు పని అని స్పష్టంచేసింది.
35) భవిష్యత్‌లో లోటుపాట్లు లేకుండా ఏం చేయాలో ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేయాలి. అంతేగానీ ఫలానా వాళ్లు తప్పు చేశారంటూ నేరుగా ఆరోపణలతో నివేదిక ఇవ్వడానికి వీల్లేదు. సాక్షులు ఏం చెప్పారో నివేదికలో పొందుపర్చకుండా ఫలానా వ్యక్తులు బాధ్యులని కమిషన్ తేల్చుతూ నివేదిక ఇవ్వడం చట్టవ్యతిరేకం.
36) ప్రజాజీవితంలో ఉన్నందున విచారణ కమిషన్ ఎదుట హాజరై సాక్ష్యం చెప్పాను. కానీ కమిషన్ చట్టబద్ధమైన విధానాన్ని పాటించలేదు. కాబట్టి కమిషన్‌ను ఏర్పాటు చేసిన జీవోను కొట్టేయాలని కోరుతున్నాను.
37) కమిషన్ 31.07.2025వ తేదీన ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో నా ప్రతిష్టను దెబ్బతీసేలా అభియోగాలు ఉన్నాయి. ఈ నివేదిక అవహేళన, అవమానకర ఆరోపణలతో నిండి ఉన్నదని 04.08.2025 తేదీన జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వెల్లడించింది. తమ్మిడిహట్టి బరాజ్ స్థలాన్ని మేడిగడ్డకు తరలించడంలో నేను ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నానని నివేదికలో ఉన్నట్టు ప్రజంటేషన్లో తెలిపారు. పరిపాలనా అనుమతులు క్యాబినెట్ ద్వారా కాకుండా వ్యక్తిగత స్థాయిలో తీసుకున్నట్టుగా ప్రకటించింది. మౌఖికంగా ఆదేశాలు ఇచ్చానంటూ కమిషన్ తప్పుగా పేర్కొంది.
38) నేను ముఖ్యమంత్రిగా ఉండగా అవకతవకలు జరిగాయంటూ నన్ను అప్రతిష్టపాలు చేసేలా నివేదిక ఉన్నది. నా ఖ్యాతికి మచ్చ తెచ్చే ప్రయత్నం జరిగింది. ప్రజలకు చేదోడువాదోడుగా ఉన్న నేతకు రాజకీయంగా కళంకం తీసుకొచ్చేలా, సమాజంలో అపకీర్తిని ఆపాదించేలా ప్రయత్నం జరిగింది. ఒకవేళ అవకతవకలను గుర్తిస్తే విచారణ కమిషన్ చట్టంలోని 8-బీ, 8-సీ సెక్షన్ల కింద నోటీసు ఇవ్వాలి. కానీ అలా జరగలేదు. ఎవరైనా సాక్షులు లేదా సమాచారంలో వచ్చిన అభియోగాలకు వివరణ కోరలేదు. అలాంటి సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. రెండు సెక్షన్లను కమిషన్ అమలు చేయకుండా నా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరిగింది.
39) విచారణ కమిషన్ చట్టంలోని సెక్షన్ 8బీ ప్రకారం.. ఒక వ్యక్తి ప్రవర్తనపై సందేహాలు ఉంటే కమిషన్ విచారణ అవసరమని భావించినప్పుడు నోటీసు జారీ చేయాలి. విచారణ నివేదికతో వ్యక్తి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లే అవకాశం ఉండకూడదు. అదే పరిస్థితి ఉంటే కమిషన్ ఆ వ్యక్తికి విచారణలో తన వాదన వినిపించడానికి, సాక్ష్యాలను సమర్పించడానికి సహేతుకమైన అవకాశమివ్వాలి. అదే చట్టంలోని 8సీ సెక్షన్ ప్రకారం అలాంటి అభియోగాలు చేసిన వారిని క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు వీలు కల్పించాలి. సెక్షన్ 8బీలో నిర్దేశించిన వ్యక్తిని, ఇతరులను కమిషన్ అనుమతితో క్రాస్‌ఎగ్జామిన్ చేసేందుకు వీలు కల్పించకుండానే కమిషన్ నివేదిక సమర్పించింది.
40) కమిషన్ విచారణ సందర్భంగా తేలిన అంశాలతో ఎవరి ప్రతిష్ట అయినా దెబ్బతినే అవకాశం ఉంటే, చట్ట ప్రకారం వారికి కమిషన్ నోటీసులు జారీ చేసి, అభియోగాలపై విచారణ జరపాలి. వారికి సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. విధిగా అమలు చేయాల్సిన ఈ నిబంధనను కమిషన్ పట్టించుకోలేదు.
41) కిరణ్ బేడి వర్సెస్ కమిటీ ఆఫ్ ఎంక్వయిరీస్ కేసులో నోటీసు ఇవ్వకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఢిల్లీ హైకోర్ట్ బార్ అసోసియేషన్‌కు చెందిన కేసులో 8బీ సెక్షన్ అమలు చేయకపోవడం వల్ల వ్యక్తి పరువు దెబ్బతింటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
42) సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. సెక్షన్ 8బీ ప్రకారం విచారణకు అవకాశమివ్వకుండానే కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలి. 20.05.2025 తేదీన కమిషన్ జారీ చేసిన సమన్లు పరిశీలిస్తే, సెక్షన్ 5(2) కింద సాక్షిగా మాత్రమే పరిగణించి విచారణకు పిలిచింది. నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయనే విషయాన్ని నోటీసులో ఎక్కడా పేర్కొనలేదు. ఇదే అంశంపై నోటీసు కూడా ఇవ్వలేదు. నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలిచ్చిన వాళ్లను క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు ఆవకాశం ఇవ్వలేదు. పైగా,కమిషన్ విచారణ చేసిన వారిలో నేనే (కేసీఆర్) చివరి వ్యక్తిని. అప్పటికి ఇతర సాక్షులు ఎలాంటి అభియోగాలు చేశారో కమిషన్‌కు తెలిసి కూడా 8బీ, 8సీ సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయలేదు. దీనిని బట్టి కమిషన్ దురుద్దేశం బహిర్గతం అవుతున్నది. కమిషన్ నివేదికపై ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి 60 పేజీలకు నివేదికను కుదింపు చేయించింది. దాని ఆధారంగా సీఎం, నీటిపారుదల మంత్రి ఇతరులు మాకు వ్యతిరేకంగా మీడియా ఎదుట 14.8. 2025వ తేదీన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మేము తప్పు చేసినట్టు కమిషన్ నివేదిక ఇచ్చిందని పాలక పెద్దలు తేల్చిచెప్పడాన్ని తీవ్రంగా పరిగణించాలి. మా ప్రతిష్టకు తీవ్ర భంగం వాటిల్లేలా సీఎం ప్రకటనలు చేయడం ద్వారా కమిషన్ నివేదికపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో అర్థమవుతున్నది. సుప్రీంకోర్టు తీర్పులను గమనంలోకి తీసుకుని, ప్రభుత్వానికి అందిన కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి. కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో6ను రద్దు చేస్తూ తుది తీర్పు వెలువరించాలి.
43) కమిషన్ పరిశీలించిన చిట్టచివరి సాక్షి నేనే(కేసీఆర్). అప్పటికే సాక్ష్యాలను క్రోడీకరించి నివేదిక రూపకల్పన చేసే దశలో కమిషన్ ఉంది. అయినా నాపై వచ్చిన అభియోగాలపై క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు కమిషన్ నాకు అవకాశం కల్పించలేదు. కాబట్టి కమిషన్ దురుద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నన్ను
కమిషన్ తప్పుదారి పట్టించింది.
44) కమిషన్ నివేదిక ఆధారంగా సీఎం, మంత్రి మీడియా సమావేశంలో చెప్పిన సమాచారం కారణంగా మాకు వ్యతిరేకంగా మీడియాలో పెద్దఎత్తున దుష్ప్రప్రచారం జరిగింది. ముందస్తు వ్యూహంతో నివేదికలోని విషయాలను మీడియాలో వచ్చేలా ప్రభుత్వం కుట్ర చేసింది.
45) కమిషన్ విచారణ సాకుతో సమర్పించిన నివేదికను రద్దు చేయాలి. నివేదికను పూర్తిగా పకన పెట్టడమే ఏకైక మార్గం. లేకపోతే మా హకులు పూర్తిగా హరించుకుపోతాయి. రాజ్యాంగంలోని 226 అధికరణం కింద హైకోర్టు జోక్యం చేసుకుని మా హకులను కాపాడాలి. చట్టవ్యతిరేక నివేదికను రద్దు చేయాలి.
46) తుది ఉత్తర్వులు జారీ చేసేలోగా నివేదిక అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి. నివేదిక ప్రతి కోసం కమిషన్‌కు లేఖ రాస్తే ఇవ్వలేదు. నివేదిక అందుకున్న ప్రభుత్వం అధికారులతో సంక్షిప్తం చేసి మాపై దాడి చేసి, సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. సాక్షాత్తు సీఎం సారథ్యంలోనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఏకపక్ష దాడి జరిగింది. కాబట్టి కోర్టు తక్షణమే జోక్యం చేసుకుని మాకు రక్షణ కల్పించాలి. మీడియా ట్రయల్ జరగకుండా చర్యలు తీసుకోవాలి. పిటిషన్ పెండింగ్‌లో ఉండగా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలి. తుది తీర్పులో కమిషన్ ఏర్పాటు జీవో6ను, కమిషన్ నివేదికను రద్దు చేస్తూ తీర్పు వెలువరించాలి.