హైదరాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): ‘బీసీ రిజర్వేషన్లు పెంచుతామంటిమి.. బీసీలను హామీలిస్తిమి.. కోర్టుల్లో నిలువని జీవో ఇచ్చి బోల్తాపడ్తిమి.. ఈ దశలో బీసీలకు ఏం సమాధానం చెప్దాం. ముఖమెట్ల చూపుదాం’ అని కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ పార్టీ బీసీ మంత్రులు, నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు బీసీ రిజర్వేషన్లు సాధిస్తామంటూ గొప్పులు చెప్పి, ఇప్పుడు తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చర్చించుకుంటున్నారు.
హైకోర్టు తీర్పు అనంతరం ఈ అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతూ ఉన్నది. అప్పటివరకు గాంధీభవన్ వద్ద సంబురాలకు సిద్ధంగా ఉన్న నేతలంతా హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. సంబురాలు పక్కనబెట్టి.. తర్వాత పార్టీ పరిస్థితి ఏమిటంటూ గాంధీభవన్లోనే చర్చలు మొదలుపెట్టారు. ముఖ్యంగా బీసీ మంత్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నట్టుగా తెలిసింది. నిన్న మొన్నటివరకు సమావేశాలు, సమీక్షలు, చర్చల పేరుతో రిజర్వేషన్లపై హడావుడి చేసి ఇప్పుడు ఏం చెప్దామని గుబులుతో ఉన్నట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలోకి వెళ్తే బీసీలు అడిగే ఏ ఒక్క ప్రశ్నకు తమ వద్ద సమాధానాలు లేదని ఆందోళన చెందుతున్నారని తెలిసింది. బీసీలకు పక్కాగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పే పరిస్థితి లేదని, ఒకవేళ మళ్లీ అవే మాటలు చెప్తే ప్రజల నుంచి చీత్కారాలు తప్పవని ఆందోళన చెందుతున్నట్టుగా తెలిసింది.
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ అసలు రూపం బయటపడుతున్నది. తీర్పు తర్వాత గాంధీభవన్లో, కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చలు ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. గవర్నర్ ఆమోదం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని ముందు నుంచే భావిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలే ఒప్పుకుంటున్నారు. అయినా పార్టీ, ప్రభుత్వ పెద్దలు మొండిగా ముందుకెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఇరుకు పెట్టేందుకు ఈ ఉత్తర్వులు చెల్లవని తెలిసినా ముందుకెళ్లారని, ఇప్పుడు ఇదే మనకు రివర్స్ అయిందంటూ గుబులు చెందుతున్నారు.
బీఆర్ఎస్ ఇతర పార్టీలపై నిందలు మోపి తప్పించుకునే పరిస్థితి లేదని ఒప్పుకుంటున్నారు. తమ పార్టీ, ప్రభుత్వ తప్పిదం, ముందుచూపులేని కారణంగానే కోర్టులో బీసీ రిజర్వేషన్లకు చుక్కెదురైందని అంటున్నారు. అనవసరంగా రాష్ట్రంలో ఎన్నికల పేరుతో అందరినీ ఇబ్బందులకు గురిచేసినట్టు అయిందని భావిస్తున్నారు. కోర్టులో కేసు ఉండగానే షెడ్యూల్ ప్రకటించడం, తీర్పు పెండింగ్లో ఉండగానే నోటిఫికేషన్ జారీ చేయడంతో గందరగోళం నెలకొన్నదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు బ్రేక్ వేయడంతో వారి ఆగ్రహం మరింత ఎక్కువైందని, వారికి ఏం చెప్పాలని అయోమయంలో పడ్డారు.