హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మలాజిగిరి జిల్లా దేవరయాంజల్ గ్రామంలో శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 1521 ఎకరాల భూవివాదానికి సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారని హైకోర్టు దేవాదాయ శాఖను నిలదీసింది. దేవాదాయ శాఖ ఉదాసీనతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 1925 నుంచి ఇప్పటివరకు ఉన్న ఒరిజినల్ రికార్డులతో హాజరుకావాలని ఆదేశిస్తే కేవలం పహాణిని మాత్రమే సమర్పించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. దేవుడి శాఖలో ఏం జరుగుతున్నదని దేవాదాయ శాఖ డైరెక్టర్ (ఇన్చార్జి కమిషనర్) హరీశ్‌ను ప్రశ్నించింది.
ఎండోమెంట్స్ ట్రిబ్యునల్‌లో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో వివరాలు ఇవ్వాలని మరోసారి ఆదేశించింది. హకులకు సంబంధించి దాఖలైన సుమారు 54 పిటిషన్లపై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ శుక్రవారం విచారణ జరిపారు. గతంలో హైకోర్టు ఆదేశించిన మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్ స్వయంగా ఈ విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కాట్రం మురళీధర్‌రెడ్డి, భూక్యా మంగీలాల్‌నాయక్ వాదనలు వినిపిస్తూ.. కమిషనర్ 2 నెలల క్రితమే బాధ్యతలు స్వీకరించినందున వివరాలు ఇచ్చేందుకు గడువు కావాలన్నారు. తదుపరి విచారణకు హాజరు నుంచి కమిషనర్‌కు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.