హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని హైకోర్టు సూచించింది. పంటల బీమా పథకం కాకపోతే మరో విధంగానైనా ఆదుకునేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నది. రాష్ట్రంలో సమగ్ర పంటల బీమా పథకంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది ఆర్ భాస్కర్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి మంగళవారం విచారణ చేపట్టింది.
ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ఆర్థిక, వ్యవసాయ శాఖలతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్థిక, వ్యవసాయ, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులకు, వ్యవసాయ శాఖ కమిషనర్‌కు, హార్టీకల్చర్ డైరెక్టర్లకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.