హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసేందుకు హైకోర్టు నిరాకరించింది. విచక్షణాధికారాలను వినియోగించి ఫీజులు నిర్ణయించబోమని తేల్చిచెప్పింది. అలాంటి ఉత్తర్వులు ఇస్తే ఫీజుల పెంపుపై ప్రభుత్వానికి సిఫారసులు చేయాల్సిన తెలంగాణ అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కోరలు తీసేసినట్లవుతుందని అభిప్రాయపడింది. కాలేజీలు సమర్పించిన ప్రతిపాదనలపై బుధవారం నుంచి ఆరు వారాల్లోగా టీఏఎఫ్ఆసీ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. టీఏఎఫ్ఆర్సీ సిఫారసులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇవన్నీ ఆరువారాల్లో పూర్తి కావాలని ఆదేశించింది. ఫీజుల పెంపు అంశం తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ విషయాలను అధికారిక వెబ్సైట్, ఇతర మార్గాల ద్వారా విద్యార్థులకు తెలియజేయాలని కన్వీనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది.
ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో గత బ్లాక్ పీరియడ్‌లో అమలు చేసిన ఫీజులనే 2025-26 విద్యా సంవత్సరానికి వర్తిస్తాయని పేరొంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను పలు కాలేజీలు సవాలు చేయడంపై శుక్రవారం కూడా విచారణ కొనసాగింది. టీఏఎఫ్ఆర్సీ సమావేశంలో తాము ప్రతిపాదించిన పెంపు కన్నా తగ్గించి రిజిస్టర్లో నమోదు చేశారన్న వాదనల మేరకు ఫీజుల పెంపునకు ఉత్తర్వులు ఇవ్వబోమని జస్టిస్ కే లక్ష్మణ్ స్పష్టంచేశారు. టీఏఎఫ్ఆర్సీ జూన్ 18న సమావేశమై కాలేజీల ప్రతిపాదనలు గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల గైడ్‌లైన్స్‌కు భిన్నంగా ఉన్నాయని, దానిపై ప్రభుత్వం అధికారులతో కమిటీని ఏర్పాటుచేసి అధ్యయనం చేశాక నిర్ణయం తీసుకోవాల్సివుందని కోర్టుకు సమర్పించిన తీర్మానాల్లో పేరొందని చెప్పారు. అంటే కాలేజీల ప్రతిపాదనలను టీఏఎఫ్ఆర్సీ ఆమోదించలేదని స్పష్ట మ వుతున్నదని తెలిపారు. ప్రభుత్వం ఏడాదికి మా త్రమే నోటిఫై చేసిందన్న వాదనలపై తదుపరి విచారణలో తేల్చుతామన్నారు. సీబీఐటీకి ఫీజుల పెంపునకు మరో సింగిల్ జడ్జి అనుమతించిన విషయాన్ని న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావిస్తూ, ఫీజుల పెంపునకు ఆమోదించినట్టు ఉత్తర్వుల్లో ఉన్నదన్నారు. దీనిపై పునఃపరిశీలించాలని కోరనున్నామని టీఏఎఫ్ఆరీసీ లాయర్ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారని అన్నారు.