హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటనపై జరుగుతున్న దర్యాప్తు పురోగతి వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటనపై ఎక్స్పర్ట్ కమిటీ సమర్పించిన నివేదిక వివరాలను సైతం తెలియజేయాలని స్పష్టం చేసింది.
మృతుల కుటుంబాలతోపాటు క్షతగాత్రులకు అందాల్సిన పరిహారంలో ఇప్పటివరకు ఎంత మొత్తం చెల్లించారో వివరించాలని పేర్కొన్నది. సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడుపై దర్యాప్తును సిట్‌కు అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సిగాచి ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు జారీచేసి, తపుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.