హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఉద్దేశపూర్వకంగా కుటుంబసభ్యుల ఆదాయ వివరాలు వెల్లడించలేదని, ఇది అవినీతి కిందకే వస్తుందని స్పష్టం చేసింది. వనమా చేతిలో ఓటమిపాలైన జలగం వెంకట్రావు 2019లో దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ను ఆమోదిస్తూ జస్టిస్ జీ రాధారాణి మంగళవారం 84 పేజీల సుదీర్ఘ తీర్పు చెప్పారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు వనమా రానందున ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవమేనని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో వనమా ఎమ్మెల్యేగా గెలిచినట్టు ప్రకటించడం చెల్లదని న్యాయమూర్తి పేర్కొంటూ.. వనమాకు బదులుగా పిటిషనర్ వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచినట్టు ప్రకటించారు. ఈ కేసులో పాల్వంచ మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్, చిక్కడపల్లి పోలీస్ ఇన్స్పెక్టర్ సాక్ష్యాలను హైకోర్టు నమోదు చేసింది.
వనమా తన భార్య పార్వతి పేరిట పాల్వంచలోని 992/2 సర్వే నంబర్లో ఉన్న 8.37 ఎకరాలతోపాటు సంస్థాన్లోని 122/2 సర్వే నంబర్లో ఉన్న 1.33 ఎకరాల ఆస్తి గురించి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదని తేల్చింది. ఈ భూములకు ఆయన ప్రభుత్వం నుంచి రైతు బంధు పథకం ద్వారా సాయం పొందినట్టు గుర్తించింది. పాల్వంచలో 300 గజాల్లోని ఇంటి గురించి 2004, 2009, 2014 ఎన్నికల అఫిడవిట్లల్లో పేర్కొన్న వనమా.. 2018 ఎన్నికల అఫిడవిట్లో దాని ప్రస్తావన కూడా చేయలేదని తప్పుపట్టింది. అందుకే వనమా ఎన్నికను రద్దు చేస్తున్నామని వెల్లడించిన హైకోర్టు.. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి పిటిషనర్ జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా కొనసాగుతారని ప్రకటించింది.