హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : కేవలం ఆరోపణలతో అత్త, మామలపై నమోదుచేసిన వరకట్న వేధింపుల కేసును హైకోర్టు కొట్టివేసింది. అత్తమామలు ఎకడ వేధించారో, ఎప్పుడు వేధించారో వంటి వివరాలు లేకుండా 498-ఏ సెక్షన్ కింద కేసు పెట్టేస్తే సరిపోదని తీర్పుచెప్పింది. ఆధారాలను సమర్పించాల్సిందేనని వెల్లడించింది.
భర్తపై కక్షసాధింపు చర్యలో భాగంగా కోడలు తమపై నమోదుచేసిన కేసును కొట్టివేయాలంటూ మహారాష్ట్రకు చెందిన 71 ఏళ్ల గోవిందప్రసాద్శర్మ, భార్య ఉషాశర్మ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి మంగళవారం విచారణ చేపట్టారు. కోడలు చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని గుర్తించారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లపై పోలీసు కేసు చెల్లదని తీర్పు చెప్పారు.