హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : రెండు ప్రధానమైన సీబీఐటీ, ఎంజీఐటీ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్త ఫీజులకు రాష్ట్ర హైకోర్టు అనుమతించింది. దీంతో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ గజి బిజి గందరగోళంలో పడినట్టయింది. కొత్త ఫీజులు కోరుతూ గురువారం 10కిపైగా ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు లంచ్మోషన్ దాఖలు చేశాయి. వాస్తవానికి 2025-26 విద్యా సంవత్సరంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్త ఫీజులు ఖరారయ్యాయి.
పెరిగిన ఫీజులను పక్కన పెట్టి, పాత ట్యూషన్ ఫీజులను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఫీజుల పెంపు విషయంలో తమ ప్రతిపాదనలు స్వీకరించి, ఫీజులు ఖరారు చేసి, సంతకాలు తీసుకున్న తర్వాత కూడా మళ్లీ పాత ఫీజులనే కొనసాగించడంపై కాలేజీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈ ఏడాది పెంచిన ఆ ట్యూషన్ ఫీజులనే కొనసాగించాలంటూ కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం కొనసాగుతున్న వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ గురువారంతో ముగిసింది. హైకోర్టు తీర్పుతో కౌన్సెలింగ్ అధికారులు గందరగోళంలో పడ్డారు.
ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలా? లేదా? అనే అంశంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్కారు నిర్ణయం వచ్చేంత వరకు నిలిపి వేయాలా? అన్న కోణంలో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. కౌన్సెలింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఆగదని అధికారులు చెబుతున్నారు. కానీ క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్టు సమాచారం.