హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : పలువురు విపక్ష నేతలతోపాటు న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే కేసులో సస్పెండైన మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ ఓఎస్టీ పీ రాధాకిషన్‌రావుకు హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి మరో రెండు జామీనులపై బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టును కింది కోర్టులో అప్పగించాలని, ఎనిమిది వారాలపాటు ప్రతి సోమవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని సూచించింది. పోలీసుల దర్యాప్తుతోపాటు కోర్టు విచారణకు సహకరించాలని షరతులు విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కే సుజన గురువారం వేర్వేరుగా తీర్పులు వెలువరించారు. హైకోర్టు తీర్పు వెలువరించడానికి ఒకరోజు ముందు పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు సీల్డ్ కవర్లో దర్యాప్తు అధికారుల నివేదికను ధర్మాసనానికి అందజేశారు.
మరో 19 మంది హైకోర్టు న్యాయమూర్తులపై కూడా నిందితులు నిఘా పెట్టారని, దర్యాప్తు జరుగుతున్నందున బెయిల్ ఇవ్వొద్దని కోరారు. దీని పై న్యాయమూర్తి తన తీర్పులో.. జడ్జీల వివరాలతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీల్డ్ కవర్లో నివేదిక అందజేశారని తెలిపారు. ఈ నివేదికపై పిటిషనర్ తరఫు న్యాయవాది ఈ ఉమామహేశ్వరరావు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఇవే విషయాలను సుప్రీంకోర్టులో చెప్పారని, తిరుపతన్న కంప్యూటర్లో ప్రొఫైల్స్ ఉన్నాయన్న నెపంతో వారి ఫోన్ల ట్యాపింగ్‌కు పిటిషనర్లు ప్రయత్నించారని చెప్పడం అన్యాయమని అన్నారు. ఇవన్నీ చెప్పినప్పటికీ ఇదే కేసులో నిందితుడు తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందని గుర్తుచేశారు. సుమారు 10 నెలలకుపైగా పిటిషనర్లు జైలులో ఉన్నారని, విచారణ ప్రక్రియ ఇప్పట్లో మొదలుకాదని, సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉంచడం హకులను హరించడమేనని చెప్పారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు, ఇద్దరు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా, ఇదే కేసులో మరో నిందితుడైన శ్రవణ్‌కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించాల్సివుంది.
ఫోన్‌ట్యాపింగ్ కేసులో రిటైర్డు పోలీసు అధికారి రాధాకిషన్‌రావును, అదనపు రిటైర్డు ఎస్పీ ఎన్ భుజంగరావును అన్యాయంగా ఇరికించారని వాళ్ల తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదించారు. అక్రమంగా కేసుపెట్టి, అన్యాయంగా ఈ కేసులో ఇరికించి, చట్టవిరుద్ధంగా రిమాండుకు తరలించారని తెలిపారు. అరెస్టుకు కారణాలను పేరొనలేదన్నా రు. ఇప్పటికే కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అన్ని ఆధారాలను సేకరించారని గుర్తుచేశారు. అన్నీ కోర్టు పర్యవేక్షణలోనే ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో 2024, మార్చిలో భుజంగరావు, రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్టు చేశారని, బెయిల్ పొందే చట్టబద్ధమైన హకు వారికి ఉందని అన్నారు. గత ప్రభుత్వ పెద్ద ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం వెనుకున్నారని పోలీసులు చెప్తున్నా అది ఎవరో పేరు వెల్లడించలేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ బెదిరింపుల వల్ల ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన వారుగానీ, తమ వద్ద డబ్బు వసూలు చేశారని ఆరోపించిన బాధితులుగానీ ఎవరూ లేరని తెలిపారు. ఇదంతా పోలీసులు అల్లిన కట్టుకథ అని చెప్పారు. భుజంగరావు ఆరోగ్య పరిస్థితి బాలేదని, జైలుకు పంపితే ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉందన్నారు.