హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్‌కు డిప్లొమా సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతోపాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు సైతం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేసింది. అయినప్పటికీ డీఈఈ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ-సూల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలను నిరాకరించడాన్ని తప్పుబట్టింది. ఇతరత్రా అర్హతలుంటే సదరు అభ్యర్థికి అడ్మిషన్ ఇవ్వాల్సిందేనని డీఈఈ కన్వీనర్‌ను ఆదేశించింది. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డిప్లొమా చేసిన తాను ఇంటర్మీడియట్ పూర్తి చేయలేదన్న కారణంతో డీఈఈ కోర్సులో కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వలేదని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీకి చెందిన కంపెల హరీశ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ కే లక్ష్మణ్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
శిఖం పట్టా భూములకు పరిహారం చెల్లించాల్సిందే
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ చట్టాలపై నీటిపారుదల అధికారులకు కనీసం అవగాహన లేకపోతే ఎలాగని హైకోర్టు ప్రశ్నించింది. శిఖం పట్టా భూ ములు, శిఖం సరారీ భూములు వేర్వేరనే విషయం వారికి తెలియకపోతే ఎలాగని నిలదీసింది. శిఖం పట్టా భూమిని ప్రభుత్వం సేకరిస్తే ఆ భూమి యజమానికి పరిహారం చెల్లించాలనే కీలక విషయాన్ని నీటిపారుదల అధికారులు తెలుసుకోవాలని స్పష్టం చేసింది. శిఖం పట్టా భూ ముల యజమానులు పరిహారానికి అర్హులేనని తేల్చి చెప్పింది. శిఖం పట్టా భూముల్లో కాళేశ్వరం కుడికాలువ పనులను చేపట్టదలిస్తే భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుడికాలువ తొమ్మిదో ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మలపేట గ్రామంలోని పెద్దచెరువును నీటితో నింపరాదని ఉత్తర్వులు ఇవ్వడంతోపాటు తమ భూముల్లో కాలువ పనులు చేపట్టకుండా ఉండేలా ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి ఇటీవల ఈ ఆదేశాలు జారీచేశారు.