హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : నిషేధి త జాబితాలోని భూముల వివరాలను గుట్టుగా ఉంచడం ఏమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ భూముల వివరాలు ప్రజలకు తెలిసేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. నిషేధిత భూముల జాబితాను సబ్రిజిస్ట్రార్లకు ఇవ్వకపోవడం ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వమే కారణమవుతున్నదని ఆగ్ర హం వ్యక్తం చేసింది. నిషేధిత భూముల జాబితాను 9 వారాల్లోగా సబ్రిజిస్ట్రార్లకు అందజేయాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టం చేసింది. లేకుంటే సీఎస్ స్వయంగా కోర్టు విచారణకు హా జరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని జస్టిస్ జే అనిల్‌కుమార్ హెచ్చరించారు. జీవో 98ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను సెప్టెంబర్ 3కు వాయిదా వేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని 194, 195 సర్వే నంబర్ల లో గల భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పుడు వాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఎలా జారీచేశారని రాష్ట్ర ప్రభుత్వా న్ని హైకోర్టు ప్రశ్నించింది. 2019లో సర్వే నంబర్ 194లోని 50 ఎకరాల భూదాన్ భూములను పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యులు కొనుగోలు చేయడంతో తలెత్తిన వివాదం హైకోర్టుకు చేరింది. దీనిపై కే లక్ష్మణ్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు.
మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి 2017లో జారీ అయిన జీవో 114 కింద క్రీడల కోటా రిజర్వేషన్ అమల్లో ఉన్నదో లేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంబీబీఎస్ అడ్మిషన్లలో క్రీడల కోటా కింద 0.5% రిజర్వేషన్లు కల్పించలేదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. క్రీడల కోటా కింద అడ్మిషన్లు కల్పించేలా కాళోజీ నారాయణరావు వైద్య వర్సిటీకి ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. కాగా, తదుపరి విచారణను సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించలేదంటూ దాఖలైన ధిక్కార పిటిషన్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్జెండర్లకు ఆసరా పింఛన్లు ఇవ్వడంతోపాటు విద్యాసంస్థలు, ప్రభుత్వ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులకు కూడా వీటిని వర్తింపజేయాలన్న తీర్పు అమలు కాలేదంటూ ఇటీవల దాఖలైన పిటిషన్‌కు నంబర్‌ను కేటాయించేందుకు రిజిస్ట్రీ నిరాకరించింది. దీంతో సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తిరసరించింది.