హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలోని సిఫార్సులకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషిపై ఎలాంటి చర్యలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. నవంబర్ 12న తదుపరి విచారణ చేపడతామని, అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నామని ప్రకటించింది.
కేసీఆర్ ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై 2 వారాల్లోగా కౌంటర్లు వేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలుంటే తదుపరి 2 వారాల్లోగా రిపె్లై కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు గతంలో మంజూరు చేసిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.