హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : వనపర్తిలో శంకరసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాలువ తవ్వకం నిమిత్తం 2013లో సేకరించిన భూమికి పరిహారం చెల్లించని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పిటిషనర్లకు భూ పరిహార బకాయిలు చెల్లించని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. పరిహారం చెల్లించే వరకు భవిష్యత్తులో ఎలాంటి భూసేకరణ చేపట్టకుండా ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని తెలిపింది. కింది కోర్టు నిర్ణయించిన పరిహారంలో 50 శాతం చెల్లించాలని 2025లో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీసింది. ఆ ఆదేశాలిచ్చి 8 నెలలు దాటుతున్నదని, అధికారులు మాత్రం సాకులు చెప్తూ జాప్యం చేస్తున్నారని ఆక్షేపించింది. అంతేకాకుండా ఇప్పుడు విచారణకు వచ్చినప్పుడు మళ్లీ గడువు కోరడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కోర్టు ధికరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని ముగ్గురు ఐఏఎస్ అధికారులకు నోటీసులు జారీచేసింది. ఫిబ్రవరి 2న జరిగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేరొంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా, సీసీఎల్ లోకేశ్ కుమార్-కు కోర్టుధికరణ నోటీసులు జారీచేసింది.
కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని తెలుపుతూ.. భూమిని కోల్పోయిన వనపర్తి జిల్లా పంగల్ మండలానికి చెందిన సుమారు 60 మందికి పైగా రైతులు కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎస్వీ శ్రవణ్‌కుమార్ సోమవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, 2013లో కాలువ తవ్వకం కోసం జరిపిన భూ సేకరణ పరిహారం వ్యవహారాన్ని వనపర్తి కోర్టు 2023లో నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. దీనిపై అధికారులు హైకోర్టులో అప్పీలు దాఖలు చేయగా, కింది కోర్టు నిర్ణయించిన పరిహారంలో 50 శాతం డిపాజిట్ చేయాలని గత ఏడాది ఏప్రిల్ 29న ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అయితే 8 నెలలు గడిచినప్పటికీ అధికారులు ఆ ఆదేశాలను అమలు చేయలేదని చెప్పారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కౌంటరు దాఖలు చేస్తూ నీటిపారుదలశాఖ నుంచి ఎలాంటి ఫైలు అందలేదని, అందిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొంత గడువు ఇస్తే కౌంటరు దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది కోరడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తీసుకున్న భూములకు పరిహారం చెల్లించలేకపోతే కొత్తగా భూసేకరణ ఎలా చేపడతారని ప్రశ్నించింది. భూసేకరణ పరిహారం బకాయిలు చెల్లింపులు పూర్తయ్యేదాకా ఎలాంటి భూసేకరణ చేపట్టరాదని ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణను వచ్చే నెల రెండో తేదీకి వాయిదా వేసింది.