హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఒక రోజులో ఒకటి కాదు వంద కాదు.. ఏకంగా 400 కేసులను సమాచార కమిషనర్ పరిష్కరించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేసులన్నీ పరిషరించాలన్న లక్ష్యం మంచిదే కావచ్చునని, అయితే 400కు పైగా కేసులను ఒకే ఒకరోజు ఎలా పరిష్కరించారని సమాచార కమిషన్ను నిలదీసింది. పది కేసులు మహా అయితే 20 కేసుల వరకు పరిషరిస్తారంటే అర్థం చేసుకోవచ్చని, ఏకంగా 404 కేసులను ఒక రోజులోనే విచారణ చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది.
కేసుల నంబర్లు లేకుండానే విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేయడం చెల్లదని తేల్చింది. 11న ఇచ్చిన నోటీసును రద్దు చేస్తున్నామని ప్రకటించింది. తిరిగి కేసుల నంబర్లు ఇతర వివరాలతో నోటీసులు జారీచేసి విచారణ చేయవచ్చునని పేరొంటూ ఆదేశాలు జారీ చేసింది. సమాచార హకు చట్టం కింద హకుల కార్యకర్త వీ శ్యామ్ కమిషన్ వద్ద 404 అప్పీళ్లను దాఖలు చేశారు.
వీటిపై విచారణకు పూర్తి వివరాలతో ఈ నెల 18న హాజరుకావాలని కమిషన్ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసును సవాలు చేస్తూ శ్యామ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. అనేక అంశాలపై కమిషన్ సమాచారం ఇవ్వకపోవడంతో పిటిషనర్ అప్పీళ్లు దాఖలు చేశారని న్యాయవాదులు మహేశ్ మామిండ్ల, కర్నాటి వెంకటరెడ్డి చెప్పారు.