High Court | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : రైతుల ఆత్మహత్యలపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం చట్టప్రకారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. జీవో 421 ప్రకారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ రైతు స్వరాజ్య వేదిక తరఫున రాష్ట్ర కమిటీ సభ్యుడు బీ కొండల్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని గురువారం తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపించారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సదరు జీవో ప్రకారం రూ.6 లక్షల పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
ఇందుకోసం బాధిత కుటుంబాలు 23 జిల్లాల నుంచి 200కు పైగా దరఖాస్తులు చేసుకున్నాయని చెప్పారు. అయితే ఆ అర్జీలను పరిశీలించి విచారణ చేపట్టేందుకు త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని చెప్పారు. దీంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వాదనల తర్వాత హైకోర్టు ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, 23 జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లోగా సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్లపై పిటిషనర్ రెండు వారాల్లో రిప్లయ్ కౌంటర్ దాఖలు చేయాలని నిర్దేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.