హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తేతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కింది కోర్టుల్లో అడిషనల్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై వారంలోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రయోజనాలకు చెందిన అంశంలో ప్రభుత్వం ఇంత ఉదాసీనత చూపడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కింది కోర్టుల్లో అదనపు, సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది బీ శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను ఇటీవల సింగిల్ బెంచ్ న్యాయమూర్తి విచారించారు. ఇది ఏ వ్యక్తికీ, కోర్టుకు చెందిన అంశం కాదని, దీన్ని ప్రజాప్రయోజన పిటిషన్‌గా విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ పిటిషన్‌పై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కింది కోర్టులో కేసుల సత్వర విచారణ అవసరమని, ఇందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం కీలకమని ధర్మాసనం పేర్కొన్నది. వారంలోగా పీపీల నియామకంపై వివరణ ఇవ్వాలంటూ విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.
ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టొద్దు ; కమ్మ, వెలమ సంఘాలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని సోమవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి ఉంటే, తుది తీర్పునకు లోబడి ఉంటాయని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసినట్టు గుర్తు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో సర్వే నం 41/15లో కమ్మ, వెలమ సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి 5 ఎకరాల చొప్పున భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం 2021 జూన్ 30న ఉత్తర్వు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్, మరికొందరు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది నామమాత్రపు ధరకు ప్రభుత్వం కుల సంఘాలకు భూమిని కేటాయించిందని, ఇందులో నిర్మాణాలు జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. ధర్మాసనం.. ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను మార్చి 7కు వాయిదావేసింది.