హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): మఠాల నిర్వహణ సరిగా లేనప్పుడు, భూముల రక్షణలో మఠాధిపతులు విఫలమైనప్పుడు చట్టప్రకారం కార్యనిర్వహణాధికారిని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని హైకోర్టు తేల్చిచెప్పింది. హైదరాబాద్ హుస్సేనిఆలంలోని శ్రీ ఉదాసీన్ మఠానికి కూకట్పల్లిలో నిజాం కాలం నుంచి వస్తున్న 540.30 ఎకరాల భూమి రక్షణ చర్యలు చేపట్టడంలో మహంత్ విఫలమైనందున ఈవోను నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు సబబేనని పేర్కొంది. మఠం వేసిన పిటిషన్ను కొట్టివేసింది. శ్రీఉదాసీన్ మఠానికి ఈవోను నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ 2009 అక్టోబర్ 14న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మహంత్ అరుణ్దాస్ ఉదాసీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈవోను నియమించే అధికారం ప్రత్యేక పరిస్థితుల్లోనే కమషనర్కు ఉంటుందని తెలిపారు. ఎలాంటి ఆరోపణలు లేనందున ఈవో నియామకం చట్టవిరుద్ధమని చెప్పారు. దేవాదాయశాఖ తరఫు న్యాయవాది భూక్యా మంగీలాల్ నాయక్ వాదనలు వినిపిస్తూ మఠం భూముల రక్షణలో మఠాధిపతి విఫలమయ్యారని అన్నా రు. వాదనలను విన్న న్యాయమూర్తి మఠాల నిర్వహణ సరిగా లేనప్పుడు ధార్మిక పరిషత్ ద్వారా ఈవోను నియమించడం సబబేనని తేల్చి చెప్పారు.
‘ఉపా అనుమతులు సబబే ; నిందితుల పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిపై ఉపా చట్టం కింద చర్యలు తీసుకోవడానికి జారీచేసిన అనుమతులను సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు నిజామాబాద్ పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ 36 మందిపై రెండు అభియోగ పత్రాలు దాఖలు చేసింది. సరైన రికార్డులు పరిశీలించకుండా ఉపా చట్టం కింద విచారణకు కేంద్రం అనుమతించడాన్ని సవాలు చేస్తూ ఏ1 అబ్దుల్ ఖాదర్, ఏ5షేక్ షాదుల్లా, ఏ24మహమ్మద్ ఇమ్రాన్ దాఖలు చేసిన పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ నిందితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ బీఆర్ మధుసూధన్రావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది.