హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బాగ్ అంబర్‌పేటలోని వివాదస్పద బతుకమ్మకుంట భూమి విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ భూమికి సంబంధించిన హకుల వ్యవహారాన్ని సివిల్ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. బాగ్ అంబర్‌పేట గ్రామ సర్వే నంబర్ 563/1లోని 7 ఎకరాల భూమిని రిజిస్టర్‌కాని విక్రయ ఒప్పందం ద్వారా సయ్యద్ అజాం అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశానని, ఆ భూమి విషయంలో స్థానిక తాసిల్దార్, జీహెచ్ఎంసీ, హైడ్రా జోక్యం చేసుకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఏ సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో సింగిల్ జడ్జి విచారణ జరిపారు. సరైన పత్రాలు, ఇతర ఆధారాలను చూపకుండా ఆ భూమిపై హకులు కోరడం చెల్లదని తీర్పు చెప్పారు. దీనిపై ఆయన దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం ఇటీవల డిస్మిస్ చేసింది. ఇది సివిల్ వివాదమని, ఆస్తిపై హకులను తేల్చాల్సింది సివిల్ కోర్టేనని తేల్చిచెప్పింది.