హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సినిమా టికెట్ ధరలు పెంచుకొనేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమోలను జారీచేయవద్దని ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అందుకు విరుద్ధంగా అఖండ-2 టికెట్ల ధరలను పెంచేందుకు ఎలా అనుమతించారని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మెమో జారీచేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చర్యను కోర్టు ధికరణగా ఎందుకు పరిగణించరాదో చెప్పాలని ఆదేశించింది.
జీవో 120 ప్రకారమే సినిమా టికెట్ ధరలు ఉండాలని ఇదే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జారీచేసిన ఉత్తర్వులకు, సెప్టెంబర్ 19న ఇదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా మెమో ఉన్నదని పేర్కొంది. వ్యాజ్యం విచారణలో ఉండగా మెమో ఇవ్వడాన్ని తప్పుపట్టింది. అఖండ-2 ప్రీమియర్ షోకు, తర్వాత 12 నుంచి టికెట్ ధరల పెంపు అనుమతి మెమో అ మలును నిలిపివేస్తూ జస్టిస్ శ్రవణ్‌కుమార్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. మూడు పిటిషన్లపై విచారణ జరిపి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. కౌంటర్లు దాఖలు చేయాలని విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.