హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : పారిశ్రామిక అవసరాల నిమిత్తం ఐడీపీఎల్‌కు కేటాయించిన భూముల స్వాధీన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పిటిషన్‌పై జూన్ 22న విచారణ జరగనున్నందున ఐడీపీఎల్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లో ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో ఐడీపీఎల్‌కు చెందిన 891.38 ఏకరాలను స్వాధీనం చేసుకుని టీజీఐఐసీకి అప్పగించాలంటూ 2008 జనవరి 27న కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను వాపస్ తీసుకోవాలని అదే ఏడాది ఫిబ్రవరి 6న బీఐఎస్ఆర్ (బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్) ఉత్తర్వులు ఇచ్చింది. వాటి అమలును నిలిపివేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఐడీపీఎల్ శుక్రవారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఐడీపీఎల్ భూముల వివాదాన్ని సింగిల్ జడ్జి వద్ద తేల్చుకోవాలని, అప్పటి వరకు భూమి విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోరాదని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): మిల్లింగ్ కోసం పంపిన వడ్లను మళ్లించారన్న ఆరోపణలపై దర్యాప్తు దశలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ మిల్లర్లపై దర్యాప్తు జరగాల్సిందేనని తేల్చిచెప్పింది. 2022-23లో మిల్లింగ్ నిమిత్త ప్రభుత్వం సరఫరా చేసిన వడ్లను 360 మిల్లుల యజమానులు తమ స్వప్రయోజనాల కోసం దారి మళ్లించారని, ఆ ధాన్యం నిల్వలకు సమానమైన బియ్యాన్ని పౌరసరఫరాల కార్పొరేషన్‌కు అందజేయలేదని, రూ.3,960 కోట్ల బకాయిలను ప్రభుత్వానికి చెల్లించలేదని నమోదైన క్రిమినల్ కేసుల కొట్టివేతకు నిరాకరించింది. వడ్ల మళ్లింపు ఆరోపణలపై మిల్లర్లు దాఖలు చేసిన 58 పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ జే శ్రీనివాస్‌రావు ఇటీవల 107 పేజీల తీర్పు వెలువరించారు.