హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 252 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలకు 45,360 బంకర్ బెడ్లు, పరుపులు, దిండ్ల సరఫరాలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విజిలెన్స్ శాఖకు రాసిన లేఖపై విచారణ జరపాలని, అవకతవకలకు బాధ్యులైనవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.15 నుంచి రూ.17 వేలకు లభ్యమయ్యే ఒక్కో బెడ్‌ను కాంట్రాక్టర్ రూ.33 వేలకు సరఫరా చేస్తున్నారని, దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.100 కోట్ల వరకు భారం పడుతుందని వివరించారు. దీంతో ఈ అభియోగంపై విచారణ జరపాల్సిందేనని జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పు చెప్పారు.