హైదరాబాద్,ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌కు 1+1 పోలీసు భద్రత కల్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఆరూరికి ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే భద్రతను తొలగించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు 2+2 భద్రత కల్పించాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. రాజకీయ కక్షతోనే ఆరూరికి భద్రత తొలగించారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీచేస్తున్న ఆరూరిపై ఎలాంటి దాడులు జరగకుండా చూసేందుకు భద్రత కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీంతో ఆరూరికి 1+1 భద్రత కల్పించాలని డీజీపీతోపాటు వరంగల్ నగర పోలీస్ కమిషనర్‌కు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.