హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘అసెంబ్లీలో బిల్లు ఆమోదిస్తే చట్టమైపోతుందా? ఆ బిల్లును గవర్నర్ ఆమోదించాలి కదా? గవర్నర్‌కు బిల్లు పంపి 3 నెలలు కూడా కాకుండానే ఆ బిల్లులో నిర్దేశించినట్టు స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవోను ఎలా జారీ చేస్తారు? జీవో 9కి ఉన్న చట్టబద్ధత ఏమిటి? ఆ జీవోకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఎలా నిర్ణయిస్తారు? బిల్లుకు ఆమోదం లేకుండా అధికారులే చట్ట ఉత్తర్వులను (సబార్డినేట్ లెజిస్లేషన్) ఎలా జారీ చేస్తా రు?’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. జీవో 9ను సవాలు చేస్తూ దాఖలైన అత్యవసర పిటిషన్లపై హైకోర్టు శనివారం దాదాపు గంటన్నరపాటు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ‘బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అసెంబ్లీలో ఏ పార్టీ వ్యతిరేకించలేదు. ప్రభుత్వ ఉద్దేశం మంచి దే కావచ్చు.
అయినప్పటికీ ఆ రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం అనుసరించే విధానం చట్టబద్ధమైనదిగా ఉండాలి కదా? పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏ రద్దుకు అసెంబ్లీ చేసిన తీర్మానానికి అనుగుణంగా గవర్నర్ బిల్లును ఆమోదించకుండానే ప్రభుత్వం సబార్డినేట్ లెజిస్లేషన్ చేయవచ్చునా? ఆ బిల్లు గవర్నర్‌కు పంపి నెల రోజులైనా తిరక్కుండానే ప్రభుత్వానికి తొందర ఏమిటి? బిల్లుకు గవర్నర్ ఆ మోదం లేకుండా జీవో 9ని ఎలా జారీ చేస్తారు? గవర్నర్ ఆమోదించే వరకు ఎం దుకు ఆగడం లేదు?’ అని ప్రశ్నించింది. ‘గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ముందుకు వెళ్లవచ్చని ఏ చట్టంలో ఉన్నదో, ఏ కోర్టు తీర్పు చెప్పిందో తెలియజేయండి’ అని ప్రభుత్వానికి స్పష్టం చేసిం ది. ప్రభుత్వం కోరుతున్నట్టుగా ఆ పిటిషన్‌పై విచారణ వాయిదా వేస్తామని పేర్కొం టూ.. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాబోదని ప్రభుత్వం హామీ ఇస్తుం దా? అని ప్రశ్నించింది. ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే జీవో 9 అమలును నిలిపివేయాల్సి వస్తుందని తెలిపింది.
అలా కాకుండా స్టేటస్ కో (యథాతథస్థితి) ఉత్తర్వులు జారీచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం బీసీ జనాభా/స్థితిగతులపై ఇప్పటివరకు డెడికేటెడ్ కమిషన్ నిర్వహించిన అధ్యయనంతోపాటు ఇతర తతంగమంతా పెద్ద సమస్యగా మారుతుందని పేర్కొం టూ.. ఏం చేయాలో ప్రభుత్వమే చెప్పాలని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ వివరణను తెలుసుకునేందుకు హైకోర్టు నుంచి బయటకు వెళ్లిన అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఏ సుదర్శన్‌రెడ్డి.. కొద్ది నిమిషాల తర్వాత తిరిగి వచ్చారు. అధికారులు ఎవరూ స్పం దించలేదని ఆయన చెప్పడంతో హైకోర్టు అరుదైన నిర్ణయాన్ని వెలిబుచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేస్తున్నామని, ఈలోగా స్థానిక సంస్థలకు ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరిస్తే తమ ముందున్న పిటిషన్లు విచారణకు మనుగడలో ఉంటాయని తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ వెలువడ్డాక ఆ ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోబోవని, కానీ.. ఈ కేసులో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటికీ పిటిషన్లపై విచారణ జరిపి చట్ట ప్రకారం తగిన తీర్పు వెలువరిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రతివాదులైన బీసీ సంక్షేమ, పంచాయతీరాజ్, సాధారణ పరిపాలన, న్యాయ శాఖ ల ముఖ్య కార్యదర్శులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.
నోటిఫికేషన్ వెలువరించినా విచారణ జరుపుతాం
అంతకుముందు ఏజీ వాదిస్తూ.. బీసీ రిజర్వేషన్ల పెంపును సవాలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు వీల్లేదని తెలిపారు. ఆ పిటిషన్‌పై దసరా సెలవుల తర్వాత విచారణ చేపట్టాలని పదేపదే కోరారు. దీంతో ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే పిటిషన్‌పై విచారణకు ఆసారం ఉండదని గతంలో సుప్రీంకోర్టు నిర్ధారించినందున దసరా సెలవులు ముగిసే వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని ప్రభుత్వం హామీ ఇవ్వాలని హైకోర్టు కోరింది. దీనిపై ఏజీ స్పందిస్తూ.. నోటిఫికేషన్ జారీ తర్వాత ఎన్నికల నిర్వహణకు 45 రోజుల గడువు ఉంటుందని, అప్పడు కూడా కోర్టు విచారణ చేయవచ్చని చెప్పారు. దీంతో ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటికీ పిటిషన్‌పై విచారణ జరుపుతామని హైకోర్టు అసాధారణ షరతు విధించి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
తొలుత పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు బీ మయూర్‌రెడ్డి, జే ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాం గం ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని వివరించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచడాన్ని ఇదే హైకోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం బీసీలకు 25%, షెడ్యూల్డ్ కులాలకు 15%, షెడ్యూ ల్డ్ తెగలకు 10% చొప్పున మొత్తం 50% రిజర్వేషన్లు ఉన్నాయని, ఇవన్నీ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 285ఏ ద్వారా సంక్రమించాయని వివరించారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను 42 % పెంచితే మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరుతాయని చెప్పారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏని రద్దు చేస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసినప్పటికీ సంబంధిత బిల్లుకు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదని గుర్తుచేశారు.