హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : ‘సత్యమేవ జయతే’ నినాదం తప్పుడు రిజిస్ట్రేషన్ల భూదందాను పట్టిచ్చింది. గిరిజన భూముల రక్షణ కోసం 1/70 చట్టం చేయడానికి ముందే ఓ భూమి తనదంటూ నకిలీ పత్రాలు సృష్టించిన ఓ వ్యక్తి అప్పటికి రిజిస్ట్రేషన్ స్టాంపు పత్రాలపై లేని ‘సత్యమేవ జయతే’ నినాదాన్ని అచ్చువేసి అడ్డంగా దొరికిపోయాడు. వాస్తవానికి ఈ నినాదం 1977 నుంచి రిజిస్ట్రేషన్ల స్టాంపు పేపర్లపై వినియోగంలోకి వచ్చింది. కానీ, అంతకు ముందే జరిగిన భూలావాదేవీల పత్రాలపై ఈ నినాదం ఉండటంతో అది తప్పుడు రిజిస్ట్రేషన్ అని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల తీర్పు వెలువరించారు. పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా న్యాయం-మోసం కలిసి పయనించలేవని, మోసంతో లబ్ధి పొందడం ఎల్లకాలం సాగదని, తప్పుడు పత్రాలతో ఎవరూ హకులు పొందలేరని, కోర్టు కండ్లుగప్పి కాలయాపన చేయలేరని న్యాయమూర్తి పేర్కొంటూ.. కల్పిత పత్రాల ఆధారంగా పొందిన మ్యుటేషన్లు, రెవెన్యూ ఎంట్రీలు, ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లబోవని స్పష్టం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్రి కోటేశ్వరరావు అనే వ్యక్తి 1959లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి గ్రామంలో 14.09 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. మాలోత్ శ్రీను అనే మరో వ్యక్తి 1973 నాటి పత్రాల ఆధారంగా ఆ భూమిపై హకులు సాధించాడు. ఇందుకు సంబంధించి ఏజెంట్ హోదాలో ఐటీడీఏ అధికారి 2011లో జారీచేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ 2013లో ప్రభుత్వం జీవో జారీ చేయడంతో కోటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గిరిజనేతరులు ఏజన్సీ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ 1970లో చట్టం అమల్లోకి రాకముందే ఆ భూమిని కొనుగోలు చేసినట్టు పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ సందర్భంగా మాలోత్ శ్రీను సమర్పించిన 1973 నాటి స్టాంప్ పేపర్‌పై ‘సత్యమేవ జయతే’ నినాదంతోపాటు అశోక చక్రం గుర్తు ముద్రించి ఉన్నది. వాస్తవానికి ఇలాంటి ముద్రణ 1977 తర్వాతే ప్రారంభమైందని గుర్తించిన హైకోర్టు.. మాలోత్ శ్రీను సమర్పించిన స్టాంప్ పేపర్ నకిలీదని తేల్చింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన మోసమని పేరొంటూ.. తప్పుడు పత్రాలను సృష్టించి భూమిపై హకులు సాధించడం చెల్లదని స్పష్టం చేసింది. ఆ 14.09 ఎకరాల్లో 98 నిర్మాణాలు ఉన్నాయని, వాటిలో 88 నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని, 54 నిర్మాణాలకు ఇంటి నంబర్లు కూడా లేవని, అక్కడ మొత్తం 130 మంది గిరిజనులు ప్లాట్లు కొనుగోలు చేశారని కలెక్టర్ నివేదించడంతో.. ఆ భూమిపై వివాదం ఉన్నదని పిటిషనర్లు పత్రికా ప్రకటనల ద్వారా హెచ్చరించినప్పటికీ కొనుగోళ్లు కొనసాగాయని హైకోర్టు గమనించింది.
చట్టబద్ధమైన హకులు లేని వ్యక్తి నుంచి ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన గిరిజనులకు ఎలాంటి హకులూ సంక్రమించబోవని తేల్చింది. ఆ గిరిజనులు చెల్లించిన సొమ్మును మాలోత్ శ్రీను నుంచి రాబట్టుకోవచ్చని స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాలు, అనధికార లావాదేవీలపై చట్టప్రకారం సమగ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. పిటిషనర్ల పేర్లను తిరిగి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. మోసపూరితంగా భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన మాలోత్ శ్రీనుపై పిటిషనర్లు సివిల్, క్రిమినల్ చర్యలు కూడా చేపట్టవచ్చని పేరొన్నది. కేసు విచారణ సమయంలోనే వివాదాస్పద భూమిలో పెద్దఎత్తున అక్రమ నిర్మాణాలు కొనసాగడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జిల్లా కలెక్టర్‌ను కూడా కేసులో ప్రతివాదిగా చేర్చి అన్ని లావాదేవీలను పరిశీలించాలని ఆదేశించింది. మాలోత్ శ్రీను షెడ్యూల్డ్ తెగకు చెందినవాడని, ఆ భూమిపై ఆయనకే హక్కులు ఉన్నాయని, ఇతర గిరిజనులకు ఆయన ప్లాట్లు విక్రయించడం చట్టబద్ధమేనని ప్రతివాది తరఫు న్యాయవాది చేసిన వాదనను తోసిపుచ్చింది. ఈ కేసు విచారణ సమయంలోనే పిటిషనర్ కోటేశ్వరరావు మరణించడంతో ఆయన కుటుంబసభ్యులకు 15 ఏండ్ల తర్వాత న్యాయం దకింది.