హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): సారాతో ప్రజారోగ్యం దెబ్బతినడంతోపాటు సమాజానికి నష్టం వాటిల్లుతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. అక్రమ సారా తయారుచేసేవారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించడం సబబేనని తేల్చిచెప్పింది. అయితే, పీడీ యాక్ట్ పేరుతో నిందితులను ఎకువ కాలం నిర్బంధంలో ఉంచడం సరికాదని పేర్కొన్నది.
అక్రమ సారా కేసులో ధరావత్ ధన్సింగ్ అనే వ్యక్తిని పీడీ యాక్ట్ కింద పోలీసులు నిర్బంధంలో కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. నిందితుడిని దీర్ఘకాలంపాటు నిర్బంధంలో కొనసాగించరాదని, అతనిపై ఉన్న అన్ని కేసులపై డిసెంబర్ 31లోగా దర్యాప్తు పూర్తిచేయాలని పోలీసులను ఆదేశించింది.