హైదరాబాద్, జూన్19 (నమస్తే తెలంగాణ): వేర్వేరుగా ఉండే తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఏకాభిప్రాయంతో ఉండాలని హైకోర్టు సూచన చేసింది. పిల్లలను నిర్లక్ష్యం చేయవద్దని హితవు చెప్పింది. తల్లిదండ్రుల మధ్య ఉండే భేదాభిప్రాయాలు పిల్లలపై పడకుండా జాగ్రతలు తీసుకోవాలని కోరింది. కోర్టు ధికరణ పిటిషన్లో మైనర్ బాలికను నెలరోజులపాటు తండ్రి కస్టడీకి ఇవ్వాలని తల్లిని ఆదేశించింది.
ఆరేండ్ల చిన్నారి వయసును దృష్టిలో పెట్టుకుని బీహెచ్ఈఎల్లో ఉండే తండ్రి, హిమాయత్‌నగర్‌లో ఉండే తల్లికి సమీపంలో ఉండాలని సూచించింది. మైనర్ బాలికను కొన్ని రోజులు తండ్రి కస్టడీకి ఇవ్వాలని గత నవంబర్ 18న హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఉద్దేశపూర్వకంగా అమలుచేయడం లేదని, తన భార్యను శిక్షించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. దీనిని జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ జరిపి పైవిధంగా సూచనలతో కూడిన ఉత్తర్వులను జారీచేశారు.