హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా చేపట్టిన సూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎస్జీటీలకు పదోన్నతుల ద్వారా ఎంత నిష్పత్తిలో సూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని స్పష్టం చేసింది. సూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో 1999 నాటి జీవో 108 అమలును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎస్జీటీల పదోన్నతులు, ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి దేవేశ్శర్మ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను అమలు చేయడంలేదని చెప్పారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో పదోన్నతుల ద్వారా ఎస్జీటీలకు 20 శాతంలోపు లభించేలా, మిగిలిన పోస్టులన్నీ ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేలా చూడాలని కోరారు. ఖాళీలను నోటిఫై చేసి డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. సూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ప్రత్యక్ష నియామకాల ద్వారా 33.33%, ఎస్జీటీలకు పదోన్నతులు, బదిలీల ద్వారా 66.66% భర్తీ చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయమని, ఆ నిష్పత్తిని మార్చాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది. పిటిషనర్లు తమ అభ్యర్థనను వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చని పేర్కొంటూ.. పిటిషన్పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.