హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): నీరు, విద్యుత్తు కొరత వల్ల ఉస్మానియా వర్సిటీలో ఈ ఏడాది మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారన్న సర్క్యులర్‌కు సంబంధించిన వివాదంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేసు నమోదుకు ఆదేశించలేమని మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో చట్టపరమైన ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని విద్యార్థులకు సూచించింది. వర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి పేర్కొంటూ.. ఏది అసలైన సర్యులరో ఏది నకిలీ సర్యులరో పోలీసుల దర్యాప్తులో తేలుతుందని అన్నారు. ముఖ్యమంత్రిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఓయూ విద్యార్థి సీహెచ్ దశరథ్, మరో ఐదుగురు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించారు.