హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : రాజ్యాంగం కోర్టులకే పరిమితం కాదని, ప్రతి వ్యక్తికీ, ప్రతి ఇంటికీ చేరాల్సినదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ అన్నారు. హైకోర్టు ఆవరణలో సోమవారం జరిగిన 77వ గణతంత్ర వేడుకల సందర్భంగా ఆయన హైకోర్టు ప్రధాన భవనంపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, రాజ్యాంగ అంతరాత్మను పరిరక్షించాల్సిన బాధ్యత బార్, బెంచ్‌లపై ఉందని పేర్కొన్నారు. న్యాయపరిపాలన అందించడం ద్వారా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని చెప్పారు.
కోర్టుల్లో మౌలిక వసతుల కల్పన జరుగుతున్నదని చీఫ్ జస్టిస్ చెప్పారు. గత ఏడాది 23 కొత్త జిల్లాల కోర్టులను ప్రారంభించామ ని, ఎనిమిది జిల్లా కేంద్రాల్లో 12 కోర్టు భవనాలకు శంకుస్థాపన చేశామని తెలిపారు.
అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి మా ట్లాడుతూ.. హైకోర్టులో ఉర్దూలో ఉన్న కేసులను సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సర్యూట్ బెంచ్ ఏర్పాటుచేసి పరిషరించిందనే చారిత్రక విషయాలను వివరించారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ జగన్ మాట్లాడారు. న్యాయమూర్తులు ఉమ్మడి హైకోర్టు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, లోకాయుక్త జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డి, ఆదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, అదనపు అడ్వకేట్ జనరల్స్ రజనీకాంత్‌రెడ్డి, మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి పాల్గొన్నారు.