రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికలను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను 30 రోజుల్లోగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ తరువాత 60 రోజుల్లోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను సెప్టెంబర్ 30లోగా పూర్తిచేయాలని స్పష్టంచేసింది. పాలకవర్గాల గడువు ముగిసిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదంటూ నల్లగొండ, నిర్మల్, జనగామ, కరీంనగర్ జిల్లాలకు చెందిన తాజా మాజీ సర్పంచులు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవీదేవి బుధవారం ఈ మేరకు తీర్పును వెలువరించారు. గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు స్పష్టంచేసింది.
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ‘గత ఏడాది జనవరి 31తో గ్రామ సర్పంచుల పాలన ముగిసింది. రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. సర్పంచుల పదవీకాలం ముగిసేలోపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి. ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన మౌ లిక సదుపాయాలను రాష్ట్రమే కల్పించాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయకపోవడం వల్ల దాదాపు ఏడాదిన్నరకంటే ఎకువ కాలం గ్రామాలకు ప్రజాపాలన లేకుండా పోయింది.
ఈ జాప్యానికి కారణాల్లోకి వెళ్లడం లేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నాలుగు, ఐదు దశల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నదని, ఇందులో మూడు దశలు పూర్తి చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మిగిలిన రెండు దశలైన గ్రామ పంచాయతీల వార్డుల ఎంపిక, సర్పంచుల సీట్లు ఖరారు, ఆ పదవులకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసేందుకు కనీసం 20 రోజుల గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే, ఈ తీర్పు ప్రతి అందినప్పటినుంచి 30 రోజుల గడువు ఇస్తున్నాం.
ఆ ప్రక్రియలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాలి. దీనిపై ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసి ఎన్నికల ఏర్పాట్లు పూర్తిచేయాలి. ఎన్నికలు ఏయే తేదీల్లో నిర్వహించాలో ఎన్నికల సంఘం ఖరారు చేయాలి. ఎన్నికల నోటిఫికేషన్‌ను వెలువరించాలి. ఎన్నికల ఫలితాలను వెల్లడించాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి 60 రోజుల గడువు ఇస్తున్నాం. ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్తంగా ఎన్నికల ప్రక్రియను ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికి లేదా అంతకంటే ముందుగా ఎన్నికల ఫలితాలను వెల్లడించాలి’ అని హైకోర్టు ఎనిమిది పేజీల తీర్పు వెలువరించింది.
ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి తన సమ్మతిని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిని తెలియజేయాల్సి ఉన్నదంటూ ఎస్ఈసీ చెప్పిన విషయాన్ని తీర్పులో ప్రస్తావించింది. రాష్ట్రం సమ్మతి చెప్పిన రెండు నెలల్లోగా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని ఎస్ఈసీని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని స్పష్టంచేసింది.
పాలకవర్గాల గడువు ముగిసిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదంటూ నల్లగొండ జిల్లా మల్లేపల్లి మాజీ సర్పంచ్ పార్వతి, కుర్మపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్, జనగామ జిల్లా కాంచనపల్లి మాజీ సర్పంచ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వెద మాజీ సర్పంచ్ అనిల్‌కుమార్, కరీంనగర్ జిల్లా చంగర్ల మాజీ సర్పంచ్ వేణుగోపాల్, నిజయతీగూడెం మాజీ సర్పంచ్ మురళీధర్ వేర్వేరుగా దాఖలు చేసిన ఆరు పిటిషన్లను అనుమతిస్తూ హైకోర్టు తుది ఉత్తర్వులను జారీచేసింది. అయితే, ఎన్నికలు నిర్వహించాలని తాము ఉత్తర్వులు జారీచేస్తున్నందున అప్పటివరకు సర్పంచుల పదవుల్లో తాజా మాజీలను కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ పిటిషినర్లు చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి నిరాకరించారు.
స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు గత ఏడాది జనవరి 30తో ముగిసిందని, 2024 జనవరి 31 నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లిందని, ఆ గడువు పూర్తయ్యేలోగా ఎన్నికలు నిర్వహించాలన్న చట్ట నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషనర్లు వాదించారు. ప్రత్యేక అధికారుల పాలన వల్ల ప్రజాపాలన లేకుండా పోయిందని, పనులు కుంటుపడ్డాయని, అధికారులకు ఇతర విధులు కూడా ఉండటం వల్ల ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఇస్తుందని చెప్పడంతో అధికారంలో ఉండగా అనేకమంది సర్పంచులు సొంత నిధులను వెచ్చించారని, అవి విడుదల కాకపోవడంతో తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదురొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికలు నిర్వహించడం జాప్యమైతే, ప్రత్యేక అధికారుల నుంచి బాధ్యతలను తాజా మాజీ సర్పంచులకు అప్పగించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
‘గ్రామ పంచాయతీలకు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు? ప్రతీ వాయిదాలోనూ ఈసారి గడువు ఇస్తే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని ఇస్తున్న హామీలు నీటి మీద రాతలే అవుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు రెడీ అంటూ గత ఫిబ్రవరిలో ఇచ్చిన హామీని ఎందుకు అమలుచేయలేదు? రెండు రోజుల క్రితం జరిగిన విచారణ సమయంలో మరో 30 రోజుల గడువు కావాలని మళ్లీ వాయిదా కోరడంలో ఔచిత్యం ఏమిటి? సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పాలకవర్గాలకు గడువు ముగియడానికి ఆరు నెలల ముందే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను ఖరారు చేసే పేరుతో ఏడాదిన్నరగా కాలయాపన చేయడమేమిటి?’ అని విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో హామీ ఇచ్చి అమలు చేయకుండా మళ్లీ వాయిదా కోరడం ఏమిటని నిలదీసింది.
వార్డుల విభజన, రిజర్వేషన్ల కేటాయింపు వంటివి ప్రభుత్వం చేస్తేనే ఎన్నికలు నిర్వహించేందుకు తమకు వీలు అవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తరఫు సీనియర్ న్యాయవాది జీ విద్యాసాగర్ చెప్పడంపై కూడా హైకోర్టు సంతృప్తిని వ్యక్తంచేయలేదు. ‘రాజ్యాంగం ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఐదేండ్ల పాలకవర్గాల గడువు అయ్యేనాటికి ఎన్నికల సంఘం విధిగా ఎన్నికలు నిర్వహించాలి కదా? ఒకవేళ ప్రభుత్వం వార్డుల విభజన, సర్పంచ్ ఇతర పదవులకు రిజర్వేషన్ల కేటాయింపు వంటి చర్యలు చేపట్టకపోతే, పాత గణాంకాల ఆధారంగానే ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించాలి కదా? ఏడాదిన్నరగా ఎన్నికలు జరపకుండా ఏం చేస్తున్నారు?’ అని ఎస్ఈసీని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని 243ఈ, 243కే అధికరణాలు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధుల పాలన ఉండేలా చేయాల్సిన బాధ్యత ఎస్ఈసీపై కూడా ఉన్నదని తేల్చి చెప్పింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు మరో 30 రోజుల గడువు కావాలని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ కోరారు. గత విచారణలోనూ ఇదే తరహాలో వాయిదా కోరిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ కోరడం ఏమిటని హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. డిసెంబర్లో విచారణ జరిగినప్పుడు రెండు నెలల గడువు కోరారని, ఇప్పుడు మళ్లీ వాయిదా కోరడం ఏమిటని ప్రశ్నించింది. బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చేందకు డెడికేటెడ్ బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేశామని, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడమే తమ ముందున్న అంశమని ఖాన్ వివరణ ఇచ్చారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జీ విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్రం నుంచి అన్నీ ఏర్పాట్లు జరిగితే, ఎన్నికల నిర్వహణకు తమకు రెండు నెలల గడువు కావాలని చెప్పారు. ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉన్నదని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. వార్డుల విభజన, రిజర్వేషన్ అంశాలు రాష్ట్ర ప్రభుత్వం చేశాకే తాము ఎన్నికలు నిర్వహించగలమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపిననాటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయడానికి 2 నెలల సమయం అవసరమని వివరించారు. జోక్యం చేసుకున్న న్యాయమూర్తి, సకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఎన్నికల నిర్వహణకు చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్ఈసీని ప్రశ్నించారు. దీనిపై న్యా యవాది స్పందిస్తూ, రిజర్వేషన్ల ఖరారుతోపాటు ఎన్నికలు సంబంధించిన ఏర్పాట్లు, పోలింగ్స్టేషన్ల ఏర్పాట్లు, భద్రత వంటి చర్యలు ప్రభుత్వమే చేయాలని తెలిపారు. అన్ని పక్షాల వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాది గుమ్మళ్ల భాసర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రత్యేక అధికారులకు ఇతర విధుల ఒత్తిడి కారణంగా ప్రజాసమస్యలు పరిసారం కావడం లేదని పేర్కొన్నారు. స్పెషల్ ఆఫీసర్లు ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని తెలిపారు. చట్ట ప్రకారం పాలకవర్గాలు లేకపోవడం వల్ల వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని వివరించారు. తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. గతంలో కూడా ప్రభుత్వం వాయిదా కోరిందని, ఇప్పుడు మళ్లీ వాయిదా కోరుతున్న ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఆసక్తి లేనట్టు అనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరిగితే తాజా మాజీ సర్పంచులకే పాలనాబాధ్యతలను అప్పగించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు. సర్పంచుల కాలపరిమితి ముగియడానికి ఆరు నెలల ముందే ఎన్నికల ఏర్పాట్లకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఒకవేళ చర్యలు తీసుకోనిపక్షంలో అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించవచ్చునని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు.