హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : శేరిలింగంపల్లి మండలం అల్లాపూర్‌లోని సున్నం చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు హైకోర్టు హైడ్రాకు అనుమతిచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పనులు చేపట్టాలని షరతు విధించింది. శాంతియుతంగా పనులు నిర్వహించేందుకు రక్షణ కల్పించాలని మాదాపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించింది. చెరువు పునరుద్ధరణ పనులపై సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని ఆర్డీవోకు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ అనిల్ కుమా ర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 8, (నమస్తే తెలంగాణ): ఐఏఎస్ అధికారి కే ఆమ్రపాలిని తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) తీర్పు అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆమ్రపాలిని తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాలని జూన్ 24న ‘క్యాట్’ ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ డీవోపీటీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదిస్తూ.. పరస్పర బదిలీకి ఆమ్రపాలి పెట్టుకున్న దరఖాస్తు నిబంధనలకు లోబడి లేదని పేర్కొన్నారు.
ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించాలని ‘క్యాట్’ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఆమ్రపాలి తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘క్యాట్’లో దాఖలు చేసిన కోర్టు ధికరణ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని చెప్పారు. ‘క్యాట్’ తీర్పుపై స్టే మంజూరు చేయరాదని కోరారు. అనంతరం హైకోర్టు స్పందిస్తూ.. ప్రస్తుతం ఆమ్రపాలి ఏపీలో పనిచేస్తున్నారని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వుల వల్ల నష్టమేమీ ఉండదని పేరొన్నది. ‘క్యాట్’ తీర్పు అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.