High Court | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): చట్టప్రకారం ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాక పెన్షన్ కోసం కోర్టుల చుట్టూ తిరిగే దుస్థితిని తెలుగు అకాడమీ కల్పించిందని హైకోర్టు తీవ్రగా ఆక్షేపించింది. పదవీ విరమణ బకాయిలు చెల్లిస్తామని సాక్షాత్తు సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చి కూడా అమలు చేయలేదని తప్పుపట్టింది. పెన్షన్ అంటే ప్రభుత్వం ఇచ్చే కానుక కాదని, అది రిటైర్డు ఉద్యోగుల హకని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు పింఛనుతోపాటు పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించాల్సిందేనని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తెలుగు అకాడమీలను ఆదేశించింది. రెండు రాష్ట్రాలకు కేటాయించిన ఉద్యోగుల సర్వీసు రికార్డులను 15 రోజుల్లో పరస్పరం అందజేసుకోవాలని, ఆ తర్వాత పెన్షన్‌ను లెకించి మిగిలిన బకాయిలను 2 వారాల్లోగా చెల్లించాలని తేల్చిచెప్పింది.
జీవిత చరమాంకంలో ఉన్న పెన్షనర్లు 6% వడ్డీ పొందేందుకు అర్హులని పేరొంటూ.. పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులపై రెండు రాష్ట్రాలు నివేదిక సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. ఆ నివేదికల పరిశీలన నిమిత్తం తదుపరి విచారణను జూన్ 27కు వాయిదా వేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని తెలుగు అకాడమీని 2022 మే 1న విభజించారు. ఈ నేపథ్యంలో తమకు పూర్తిస్థాయి పెన్షన్ అందజేయడం లేదని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 15 మంది పిటిషన్లు దాఖలు చేయడంతో జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం ఇటీవల ఈ తీర్పు ఇచ్చింది.