హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో (Old City) హై అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా ఉండేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులను, సమస్యాత్మక ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ ఫోర్స్‌ను ఉంచారు. ఫలక్‌నుమా, చంద్రాయన్ గుట్ట అలియాబాద్, శాలిబండ, మొగల్పురా, హుస్సేన్ అలం, పట్టార్ గడ్డి, మదీనా దారుషిఫా, డబ్బీర్పుర, మురిగి, చౌక్ మిరాల మండి తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Telangana | Security at Charminar in Hyderabad to maintain law and order. pic.twitter.com/UpUxPWRZ1d
— ANI (@ANI) August 26, 2022
గోషమహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు, ఆయన అరెస్టు, తదనంతర పరిస్థితుల నేపథ్యంలో పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. కాగా, రాజా సింగ్ అరెస్టు నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఎంజే మార్కెట్, బేగంబజార్ ప్రాంతాల్లో గురువారం నుంచి బంద్ కొనసాగుతున్నది.
ఈ నెల 22న మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా, ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వీడియోను రాజాసింగ్ రూపొందించి యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, ప్రశాంతతకు భంగం కలిగించేలా ఉండటంతో ఈ నెల 23న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆయనపై నగర పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు.