ఈ మధ్యకాలంలో అటు ప్రత్యక్షంగానూ, ఇటు పరోక్షంగానూ చర్చల్లో నిలిచింది అందాలభామ నిధి అగర్వాల్. ఈ హడావిడిలోనే ఆమె కథానాయికగా నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా కూడా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నిధి అగర్వాల్… హీరో ప్రభాస్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ‘మితాహారం ఎవరికైనా అగ్ని పరీక్షే. ముఖ్యంగా మేమైతే ఇష్టమైన ఫుడ్‌ని ధైర్యంగా తినలేం. తిండిని తగ్గించుకుంటేనే ఇక్కడ ఎక్కువకాలం ఉండగలుగుతాం. కానీ ‘ది రాజాసాబ్’ సెట్లో మాత్రం నేను కంట్రోల్లో ఉండలేకపోయా. నేనేకాదు.. నా తోటి హీరోయిన్లు ఇద్దరూ కూడా.
దానికి కారణం ప్రభాస్. ఆయన ఎదుటివారి డైట్ చెడగొట్టడంలో ముందుంటారు(నవ్వుతూ). కానీ ఆయన మాత్రం సెట్లో ఫ్రూట్స్ మాత్రమే తింటారు. ప్రతిరోజు ప్రభాస్ ఇంటి నుంచి ఓ క్యారియర్ వస్తుంది. అందులో సుమారు పది రకాల ఐటమ్స్ ఉంటాయి. వాటి స్మెల్ చూశాక తినకుండా ఉండలేం. భోజనప్రియులు రెండు రకాలుంటారు. వారిలో తింటానికి ఇష్టపడేవారు కొందరైతే.. తినిపించడానికి ఇష్టపడేవారు కొందరు. ప్రభాస్ రెండో టైప్. ఆయన తినిపించి ఆనందపడుతుంటారు.’ అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.