ఆనందంగా సాగుతున్న ఆమె జీవితం అనుకోకుండా ఓ సుడిగుండంలో చిక్కుకుంది. అందులోంచి బయటపడాలంటే ఈదాల్సిందే! ఔషధాలతో కుదుటపడని ఆరోగ్యాన్నికాపాడుకోవడానికి స్విమ్మర్‌గా అవతారం ఎత్తిందామె. మూడేండ్లు తనకు నరకం చూపించిన కాళ్ల మంటలు, నరాల నొప్పులను ఈత కొలనులోనే నయం చేసుకుంది. అక్కడితో ఆగకుండా జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి అబ్బురపరిచింది 59 ఏండ్ల పొలిశెట్టి శోభారాణి. ఆరు పదులకు చేరువ అవుతున్న వయసులో… ఈతలో అద్భుతాలు చేస్తున్న శోభారాణిని జిందగీ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
నన్ను నేను పరిచయం చేసుకోమంటే స్విమ్మింగ్‌కు ముందు స్విమ్మింగ్‌కు తరువాత అనే చెబుతాను. నా జీవితంలో ఈత ఆ స్థాయిలో ప్రభావం చూపించింది. మాది హనుమకొండలోని బాలసముద్రం. ఇంటర్ పూర్తికాగానే బంధువుల అబ్బాయితోనే పెళ్లి చేశారు. మా ఆయన ప్రోత్సాహంతో డిగ్రీ, హిందీ పండిత్ ట్రైనింగ్ చేశాను. కుటుంబ బాధ్యతలంటే ఇష్టంతో ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా గృహిణిగా స్థిరపడ్డాను. మా ఆయన బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. మాకు ఇద్దరు కొడుకులు. ఆనందంగా సాగిపోతున్న మా జీవితంలో తొమ్మిదేండ్ల కిందట ఊహించని సమస్య వచ్చిపడింది. అకస్మాత్తుగా నాకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. పాదాల మంటలు, నరాల సమస్యలతో మూడేండ్లు పోరాడాను. లక్షలు పోసి వైద్యం చేయించినా ఫలితం కనిపించలేదు.

Shobarani
ఆరు నెలల్లోనే ఫలితం
మావారికి స్విమ్మింగ్ చేసే అలవాటుంది. సమయం దొరికినప్పుడల్లా ఈత కొట్టేందుకు హనుమకొండలోని ప్రభుత్వ స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్తుండేవారు. మా బాబును కూడా స్విమ్మింగ్‌కు తీసుకెళ్తుండేవారు. ఒకటి రెండుసార్లు నేనూ వారితో వెళ్లాను. అక్కడ కోచ్‌తో మాట్లాడుతున్నప్పుడు ఆడవాళ్లు కూడా స్విమ్మింగ్ కోసం వస్తుంటారని తెలిసింది. నాకూ నేర్చుకోవాలనిపించింది. అదే విషయం మా ఆయనతో చెబితే స్విమ్మింగ్‌లో జాయిన్ చేశారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వెళ్లి నేర్చుకునేదాన్ని. మూడు నెలల్లో ఈత కొట్టడం వచ్చింది. తర్వాత ఆరు నెలల్లో నా నరాల నొప్పులు, పాదాల మంటలు ఎవరో తీసేసినట్టు మటుమాయం అయ్యాయి. అసలు నమ్మలేకపోయాను. నా సమస్యకు స్విమ్మింగ్ దివ్యౌషధంగా పనిచేసింది.
జాతీయ స్థాయిలోనూ
ఆరోగ్యం కుదుటపడ్డాక కూడా స్విమ్మింగ్ కొనసాగించాను. అదే సమయంలో మా కోచ్, కొందరు స్నేహితులు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనమని నన్ను ప్రోత్సహించారు. అలా ఈ ఏడాది అక్టోబర్‌లో మొదటిసారి ఈత పోటీలో పాల్గొన్నా. హైదరాబాద్‌లో జరిగిన 10వ తెలంగాణ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్-2025లో అండర్ 55-59 మహిళల విభాగంలో సత్తా చాటి గోల్డ్‌మెడల్ సాధించా. ఆ తరువాత జాతీయస్థాయి పోటీలే లక్ష్యంగా కసరత్తు చేశా. రోజుకు గంటల తరబడి ప్రాక్టీస్ చేశా. నవంబర్‌లో నిర్వహించిన 21వ జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో అండర్ 55-59 మహిళల విభాగంలో పాల్గొని, కాంస్య పతకాన్ని సాధించా. అలా జాతీయస్థాయి పోటీలో మూడోస్థానంలో నిలిచాను.
తోడుగా నిలిచారు
స్విమ్మింగ్‌తో నా ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పుడు హాయిగా జీవిస్తున్నా. నా శరీరం నా అదుపులో ఉందనే భావన కలుగుతున్నది. వెన్నునొప్పి, మెడనొప్పి వంటివాటికి సైతం స్విమ్మింగ్ మంచి ఉపశమనం ఇస్తుంది. నిజానికి మహిళలు బయటికి రావాలంటే కుటుంబాల ప్రోత్సాహం తప్పనిసరి. నా విషయంలో నా కుటుంబం అండగా నిలిచింది. ఈ వయసులో స్విమ్మింగ్ చేస్తే ఇతరులు మనల్ని ఎగతాళి చేస్తారన్న ఆలోచనలు పక్కన పెట్టి నా ఆరోగ్యమే ప్రధానం అని భావించా. స్విమ్మింగ్ డ్రెస్ కూడా నిండుగా ఉంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకున్నాను. నన్ను చూసి మా వదిన కూడా తన ఆసక్తిని పంచుకుంది. అయితే, ఇతర కార ణాలతో ఆచరణలో పెట్టలేకపోయింది.
ఇదే లక్ష్యం
జాతీయ స్థాయి పోటీల్లో చాలా నేర్చుకున్నాను. కర్ణాటక, కేరళ రాష్ర్టాలకు చెందిన స్విమ్మర్ల వేగాన్ని చూసి ఆశ్చర్యపోయాను. వాళ్లలా సత్తా చాటాలని మరింత కసరత్తు చేస్తున్నా. స్విమ్మింగ్ నేర్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకున్న నేను జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అప్పుడే కదా ఈత నేర్చుకోవాలనే మహిళలకు నేను ఆదర్శంగా నిలవగలను!
…? రాజు పిల్లనగోయిన

Shobarani