హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : మావోయిస్టు నేత హిడ్మాది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనని, రక్షణ కోసం లొంగిపోయే అవకాశాలు ఉన్న ఆయనతో సంప్రదింపులు జరుపకుండా ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. కాల్పుల విరమణ ప్రకటించి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తారా? ఇది యుద్ధధర్మమా అని ప్రశ్నించారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో గురువారం మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహతో కలిసి ఆయన మాట్లాడారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రకటనకు నిదర్శనమే ఈ వరుస ఎన్కౌంటర్లు అని గుర్తుచేశారు.
మావోయిస్టుల హత్యలపై వెంటనే సమగ్ర న్యాయ విచారణ చేపట్టడంతో పాటు ఒక శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఎన్కౌంటర్లు నిలిపివేసి, పోలీసుల అదుపులో ఉన్నట్టు చెబుతున్న మావోయిస్టు నాయకులు తిరుపతి(దేవ్జీ)తో పాటు అందరినీ న్యాయస్థానంలో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. ఏకపక్ష ఎన్కౌంటర్లపై గురువారం మఖ్ధూంభవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుందని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్కౌంటర్కు ఫేక్ ఎన్కౌంటర్కు తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించేవారిపై అర్బన్ నక్సలైట్ ముద్ర వేస్తున్నారని ధ్వజమెత్తారు.