హిమాయత్‌నగర్, నవంబర్ 22: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మాది ముమ్మూటికీ బూటకపు ఎన్కౌంటర్ అని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, సహాయ కార్యదర్శి మదన కుమారస్వామి ఆరోపించారు. శనివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. హిడ్మా ఆయన భార్య రాజేతోపాటు మరికొంత మం దిని నిరాయుధులుగా పట్టుకుని.. క్రూరంగా హత్య చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ కట్టుకథను పోలీసులు అల్లారని తెలిపారు.
కేంద్రప్రభుత్వం 22 నెలలుగా జరిపిన ఎన్కౌంటర్లలో సుమారు 780 మందికిపైగా మావోయిస్టులు, ఆదివాసీలు మరణించారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల ప్రాణాలు తీసే అధికారం రాజ్యానికి లేదని గుర్తుచేశారు. అటవీ సంపదను కొందరు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే కేంద్రం ఆపరేషన్ కగార్‌ను చేపట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ప్రశ్నించే గొంతును లేకుండా కేంద్రం కుట్ర లు చేస్తుందని విమర్శించారు. బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్రం అవలంబించే ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పౌరసమాజం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.