నర్సింహులపేట, ఏప్రిల్ 5 : యాసంగి పంటలను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న కష్టానికి అద్దం పడుతుందీ చిత్రం. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఆకేరు వాగును నమ్ముకొని దాని పరీవాహక గ్రామాలైన జయపురం, కౌసల్యదేవిపల్లి, బొజ్జన్నపేట, రామన్నగూడెం, ముంగిమడుగు, ఫకీరతండా రైతులు వరి సాగుచేశారు. పంటలు పొట్ట, ఈనే దశకు వచ్చే సరికి వాగు అడుగంటి ఎండిపోయే పరిస్థితికి చేరింది. రైతులు వాగులో జేసీబీతో గుంతలు తీయించి నీరు ఊరగానే మోటర్లతో పొలాలకు పారిస్తున్నారు. రామన్నగూడేనికి చెందిన రైతు షేక్ యాకూబ్ తన రెండెకరాల పొలాన్ని కాపాడుకునేందుకు వాగులో తీసిన గుంతలోకి నీరుచేరేందుకు కొద్దిదూరం నుంచి కాలువ తీశాడు. అది పూడుకుపోయి నీరు గుంతలోకి చేరకపోవడంతో ఇలా చేతులతో ఇసుక తీస్తూ జలాలను గుంత వరకు తరలిస్తున్నాడు.