వరంగల్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మేడారంలో గద్దెల ప్రాంగణంపై హెలికాప్టర్ చక్కర్లు వద్దని దేవాదాయ శాఖ వారించినా వినని దయనీయస్థితి నెలకొన్నది. మేడారం జాతర నిర్వహణలో శాఖల మధ్య సమన్వయలోపానికి హెలీకాప్టర్ రైడ్ మచ్చుతునకగా నిలిచింది. మేడారంలో 2016 నుంచి హెలీకాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి మేడారంలోని సమక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం, చిలుకలగుట్టపైకి వెళ్లకూడదని మేడారం వడ్డెలు (పూజారులు), ఆదివాసీ ప్రతినిధులు ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈసారి ఆ ఆనవాయితీ తప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హనుమకొండ, ములుగు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర పర్యాటకశాఖ ‘తంబీ హెలీసంస్థ’తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా గురువారం నుంచి ఈ నెల 31 భక్తుల సేవలో రెండు హెలీకాప్లర్టు అందుబాటులోకి తెచ్చారు. హెలీరైడ్ ద్వారా మేడారం జాతర పరిసరాలను గగన వీక్షణ చేస్తున్నారు. గద్దెల ప్రాంగణం, చిలుకలగుట్ట పై నుంచి హెలీకాప్టర్ చక్కర్లు కొట్టొద్దని ఎంత వారించినా వినడంలేదని ఆదివాసీలు, పూజారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తల్లుల గద్దెలమీది నుంచి ఆ హెలీకాప్టర్ చక్కర్లు కొట్టొద్దని చెప్పండి’ అని దేవాదాయ శాఖ అధికారులు ‘సెట్’లో పలుమార్లు చెప్పినా ఫలితం లేకుండా పోతున్నది.
మేడారం దారులు అప్పుడే కిక్కిరిసిపోతున్నాయి. భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సర్కార్ పేర్కొన్నదంతా ఉత్తదేనని ట్రాఫిక్ ఆచరణ చూస్తే తెలుస్తుందనే భక్తులు ఉదహరిస్తున్నారు. జాతర ఇంకా ప్రారంభమే కాలేదు. ఆర్టీసీ నడిపే 4వేల బస్సులు, అంతకు పదింతలు ప్రైవేట్ వాహనాలు మేడారం బాట పట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. వరంగల్ ములుగు రోడ్ నుంచి ములుగు దాకా, ములుగు నుంచి తాడ్వాయి వయా పస్రా దాకా ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అవుతున్నది. మరోవైపు సంక్రాంతి సంబురాలకు టోల్ ఎత్తేసిన రేవంత్ సర్కార్ మేడారం జాతరకు వెళ్లే భక్తులకూ ఎత్తివేయాలనే డిమాండ్ వ్యక్తం అవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా టోల్‌ప్లాజాల విషయం ఏమోకానీ కనీసం ములుగు జిల్లా జవహర్‌నగర్‌ని టోల్‌ప్లాజాలో జాతర వరకు టోల్ ఎత్తివేయాలని భక్తులు కోరుతున్నారు. టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోవటం ట్రాఫిక్ జామ్‌కు కారణం అవుతున్నది.