దరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గడిచిన 20 గంటలుగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వైపు దూసుకొస్తున్నది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రాగల 36 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలంగాణ వెదర్‌మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా జూలై 29 అర్ధరాత్రి నుంచి 30 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు అత్యంత తీవ్రంగా మారనున్నాయని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 30 సెం.మీ. నుంచి 45 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు రోజంతా ముసురు వాతావరణం ఉంటుందని వెదర్‌మ్యాన్ తెలిపారు.
అలాగే నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్లగొండ వంటి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం స్వల్ప వర్షపాతం నమోదు కావచ్చని స్పష్టంచేశారు. ప్రమాదకర పరిస్థితులు ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రాకూడదని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గురువారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తున్నది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. దీంతో ఈ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు.
పలు జిల్లాల్లో భారీ వర్షపాతం
రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాపల్లి జిల్లా పలిమెలలో అత్యధికంగా 19.43 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్‌లో 19.40 సెం.మీ, బుగ్గారంలో 18.33 సెం.మీ, వెలగటూర్లో 17.57 సెం.మీ, ఎండపల్లిలో 15.38 సెం.మీ, రాయకల్‌లో 14.97 సెం.మీ , జగిత్యాలలో 14.97 సెం.మీ, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 14.14 సెం.మీ, ములుగు జిల్లా వాజేడులో 13.36 సెం.మీ, నిర్మల్ జిల్లా నిర్మల్‌లో 13.23 సెం.మీ, నిజామాబాద్ జిల్లా మెండోరాలో 10.81 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.